ఆదేశాలు ఉల్లంఘిస్తే ధిక్కరణ చర్యలే!

ఉపాధి బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్రప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి విరుచుకుపడింది. ఈ వ్యవహారంలో సుమారు 500 వ్యాజ్యాలు దాఖలైతే కేవలం 25 మంది పిటిషనర్లకే పూర్తి బిల్లులు చెల్లించడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇంకా చెల్లించని వారికి వారం రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లుల చెల్లింపును ఎంతకాలం నిలుపుదల చేస్తారని మండిపడింది. పిటిషనర్లు చేసిన పనుల విషయంలో విచారణ జరుపుతున్నప్పుడు కనీసం వారికి నోటీసులు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీసింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం జమచేసిన నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించే విషయంలో సహకరించని సర్పంచ్‌లపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలు అమలు చేశారా లేదా అనేదే తమకు ముఖ్యమని, ఇతర అంశాలతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఆదేశాలిచ్చారు. గత నెల 23న ఇచ్చిన తమ ఆదేశాల మేరకు ఎంత మంది పిటిషనర్లకు బిల్లులు చెల్లించారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించారు. వివరాలు సమర్పించేందుకు 2వారాల సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు(మెటీరియల్ కాంపోనెంట్) వైసీపీ సర్కారు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన సుమారు 500 వ్యాజ్యాలు ఇటీవల విచారణకు రాగా.. రెండు వారాల్లో బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కోర్టుకు హామీ ఇచ్చి కూడా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని తెలిపారు. విజిలెన్స్ నివేదిక పేరుతో చెల్లించాల్సిన మొత్తంలో 20 శాతం కోత విధించిందని.. న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్‌శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది కిరణ్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు చేసిన పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలిందని.. అలాంటి వారికి బిల్లులు చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విజిలెన్స్ విచారణ పెండింగ్ ఉన్న పనుల విషయంలో.. చెల్లించాల్సిన మొత్తంలో 20ు కోత విధించామని తెలిపారు.

Share this on your social network: