ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్

Published: Saturday September 11, 2021

 హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై మా అధ్యక్షుడు నరేష్ స్పందనను తప్పుపట్టారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్.. అంటూ నరేష్‌కు హితబోధ చేశారు బండ్ల. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోలో మాట్లాడిన బండ్ల గణేష్ ఈ కామెంట్స్ చేశారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు టాలీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..

‘‘సాయిధరమ్ తేజ్‌గారు షూటింగ్స్ చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు.. అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్‌లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తూ మరణించిన వారి పేర్లు చెప్పడం కానీ, మీరట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడెందుకు సార్. రేసింగ్ చేశాడు.. అది చేశాడు, ఇది చేశాడు. మీ ఇంటి దగ్గరకు వచ్చాడు.. ఎందుకు ఇవన్నీ చెప్పండి. తప్పు కదా సార్. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి త్వరగా కోలుకోవాలి.. సాయిధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఇట్లాంటవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. సాయిధరమ్ తేజ్, భగవంతుడి ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా ఉంటుంది.. థ్యాంక్యూ’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.