గాడిద పాలతో సబ్బులేంటని నవ్వినవాళ్లే ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు..

Published: Wednesday September 15, 2021

ఆ ఐడియా చెప్పగానే అందరూ పగలపడి నవ్వారు.. స్నేహితులు, కుటుంబసభ్యులు అనే తేడా లేకుండా అందరూ ఎగతాళి చేసిన వారే. ‘‘గాడిద పాలతో సబ్బులు చేస్తావా...ఆపై లాభాలు గడిస్తావా..’’అంటూ మొహమ్మీదే ఎగసెక్కాలు ఆడారు. సరిగ్గా ఏడాది కిత్రం..ఇటువంటి ప్రతికూలత మధ్య అతడు తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ..భారీగా లాభాలు గడిస్తున్నాడు. జోర్డాన్‌కు చెందిన 32 ఏళ్ల ఎమాద్ అట్టియట్ సక్సెస్ స్టోరీ ఇది. 

ఇటువంటి వ్యాపారంలోకి దిగాడంటే..ఎమాద్‌ది వ్యవసాయం నేపథ్యం అనుకుంటే మనం పొరబడినట్టే..! ఎందుకంటే.. అతడు మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో పీజీ చేశాడు. అయితే.. తన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క చాలా కాలం పాటు అవస్థలు పడ్డాడు. చివరికి తన తల్లి సలహా మేరకు ఎమాద్ ఈ వ్యాపారంలోకి దిగి విజయం సాధించాడు. గాడిద పాలతో సబ్బులు చేయాలన్న ఆలోచన మొదట ఎమాద్ తల్లికి వచ్చింది. ఈ ఐడియా సాధ్యాసాధ్యాలపై వారు కొంత కాలం సమీక్షించుకున్నాక  కార్యరంగంలోకి దిగారు. జోర్డాన్‌లో ఎవ్వరూ కూడా అప్పటివరకూ గాడిద పాల సబ్బుల గురించి వినలేదు. దీంతో..అతడి ఐడియా విని పెదవివిరిచిన వారు..నిరుత్సాహపరిచిన వారే ఎక్కువ. అయితే.. ఎన్ని విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వారు వెనకడుగు వేయక తమ ఐడియాపై అచంచల విశ్వాసంతో ముందుకెళ్లారు. ఫలితం.. ఏడాది తిరిగే సరికల్లా వారు మంచి లాభాలు కళ్లజూడటం ప్రారంభించారు. 

ఎమాద్ స్థాపించిన సంస్థ పేరు అటాన్ డాంకీ మిల్క్ సోప్స్. అరబ్బీలో అటాన్ అంటే ఆడ గాడిద అని అర్థం. అమ్మాన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడాబా అనే ప్రాంతంలో వీరు 12 గాడిదలను పెంచుతున్నారు. ఒక్కో గాడిద రోజుకు రెండు లీటర్ల పాలు ఇస్తుంది. లీటరు పాల కోసం రోజులో మూడు సార్లు ఎలక్ట్రానిక్ హ్యాండ్ పంప్ సాయంతో అక్కడి సిబ్బంది పాలు పితుకుతారు. మిగతాది గాడిద పిల్లల కోసం వదిలేస్తారు. ఇలా వచ్చిన పాలను శీతలీకరించాక వాటిని జోర్డాన్ రాజధానిలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ ఎమాద్ తల్లి స్వీయ పర్యవేక్షలో ఈ సబ్బులు తయారవుతాయి.