రాత్రికి రాత్రే కోటీశ్వరులైన 500 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు..

వారందరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు.. వారిలో చాలా మంది వయసు 30 ఏళ్ల లోపే.. వారంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు.. వారందరూ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల సంస్థ `ఫ్రెష్‌వర్క్స్` ఉద్యోగులు. అంతేకాదు ఆ సంస్థలో షేర్ హోల్డర్లు కూడా. గురువారం ఈ సంస్థ అమెరికా స్టాక్ మార్కెట్ `నాస్‌డాక్`లో లిస్టింగ్‌కు వెళ్లింది. లిస్టింగ్ డే నాడే కంపెనీ భారీగా లాభపడింది. కంపెనీ ప్రైస్ బాండ్ 36 డాలర్లుగా కేటాయించగా తొలిరోజు ఏకంగా 21శాతం పెరిగి 43.5డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాపిటల్ ఏకంగా 12.3 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో షేర్ హోల్డర్లందరూ భారీగా లాభపడ్డారు.
`ఫ్రెష్‌వర్క్స్` సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 76 శాతం మంది షేర్లు తీసుకున్నారు. దీంతో వారందరూ ఐపీఓకు వెళ్లిన తొలి రోజే కోటీశ్వరులు అయిపోయారు. వారిలో 500 మంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. అందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. వారిలో 69 మంది 30 ఏళ్లు లోపు వాళ్లు కావడం గమనార్హం. 2010లో ప్రముఖ పారిశ్రామిక వేత్త గిరీష్ మాతృభూతం ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో ప్రముఖ సీక్వోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ జి తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కాగా, యూఎస్ స్టాక్ మార్కెట్ `నాస్‌డాక్`లో లిస్టింగ్‌కు వెళ్లిన భారత తొలి సాఫ్ట్‌వేర్ సంస్థల స్టార్టప్ కంపెనీగా `ఫ్రెష్‌వర్క్స్` నిలిచింది.

Share this on your social network: