భయపడను.. ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..

Published: Saturday October 02, 2021

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీచ్‌తో మొదలైన మాటల యుద్ధానికి ఇంకా ఫుల్ స్టాప్ పడనేలేదు. పవన్ మాట్లాడటం.. ఆయన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు, కీలక నేతలు, సినీ ప్రముఖులు కౌంటర్‌లు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇదో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో ‘శ్రమదానం’ కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టడం.. ఆ కార్యక్రమానికి, బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. సభా ప్రాంగాణానికి వెళ్లి స్పీచ్ ఇచ్చేంత వరకూ అడగడుగునా టెన్షన్.. టెన్షనే.

 

వర్షంలోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, తనపై విమర్శలు గుప్పించిన సినీ ప్రముఖులకు ఈ సభా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్లు, వార్నింగ్‌లు ఇచ్చారు. మరీ ముఖ్యంగా పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు, బూతులు తిట్టిన వారిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ‘నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..?. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చాను. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటున్నారా?. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.