విదేశీ విమానాలు ఎగిరేదెప్పుడో..!?
కరోనా నుంచి అన్ని రంగాలు కోలుకొని ఇంతకు ముందులాగే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. విదేశీ విమానాల రాకపోకలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి పొరుగు దేశాలు, వాణిజ్య సంబంధాలున్న దేశాలకు విమానాలు వెళ్లి వస్తున్నాయి. విశాఖకు మాత్రం ఆ భాగ్యం ఇంకా కలగలేదు. విదేశీ సర్వీసులు నడపడానికి ఏ విమానయాన సంస్థా ముందుకు రాలేదు. కరోనాకు ముందు విశాఖపట్నం నుంచి దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు విమాన సర్వీసులు ఉండేవి. వీటిలో మొదట మొదలైంది దుబాయ్ సర్వీసు. ఎయిర్ ఇండియా ఓ విమానాన్ని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా ప్రతిరోజూ దుబాయ్‌కు నడిపేది. అందులో 240 సీట్లు వుండగా, 50 శాతం సీట్లు ఇక్కడే నిండిపోయేవి. సీజన్‌లో అయితే 70 శాతం ఫుల్ అయ్యేవి. కరోనా తరువాత అన్ని విదేశీ విమానాలు ఆగిపోయాయి. రెండు నెలల నుంచి దుబాయ్ విదేశీ పర్యాటకులను అనుమతిస్తోంది. ప్రస్తుతం అక్కడ వరల్డ్ ట్రేడ్ ఎక్స్‌పో జరుగుతోంది. అక్టోబరులో మొదలై మార్చి నెలాఖరు వరకు ఉంటుంది. ఐదేళ్లకు ఓసారి జరిగే ఈ ఎక్స్‌పోకు విపరీతమైన ఆదరణ ఉంది. అక్కడ వ్యాపార అవకాశాల కోసం ఉత్తరాంధ్ర నుంచి ప్రతి వారం 500 మంది వరకు ఇప్పుడు దుబాయ్ వెళుతున్నారు. అయితే విశాఖ-దుబాయ్ విమాన సర్వీసు లేకపోవడంతో హైదరాబాద్ లేదా చెన్నై వెళ్లి... అక్కడి నుంచి వేరే విమానం ద్వారా వెళుతున్నారు. ఈ సమస్య లేకుండా ఉండాలంటే... గతంలోలా విశాఖ-హైదరాబాద్-దుబాయ్ సర్వీసు నడపాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. గతంలో ఎయిర్ ఇండియా ఈ సర్వీసు నడిపేది. ఇప్పుడు టాటా గ్రూపు ఆ సంస్థను టేకోవర్ చేయడంతో వెంటనే సర్వీసు పునరుద్ధరణ జరిగే అవకాశం లేదని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (అపాటా) చెబుతోంది. అయితే ఇండిగో సంస్థ హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు విమానం నడుపుతోందని, వారితో చర్చించి విశాఖ నుంచే ఆ సర్వీసు మొదలయ్యేలా చూస్తామని ఏపీ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి ఓ.నరేశ్‌కుమార్ తెలిపారు.
బ్యాంకాక్‌లో కూడా విదేశీ పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎయిర్ ఆసియా సంస్థ నవంబరు నుంచి బ్యాంకాక్ సర్వీసు నడపడానికి అంగీకరించింది. సింగపూర్ ఇంకా పర్యాటకులను అనుమతించడం లేదు. దానికంటే ముందు మలేషియా, శ్రీలంకలకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రాంతాలకు కూడా సర్వీసులు పునరుద్ధరించాలని కోరుతున్నామని అపాటా ప్రతినిధులు కుమార్‌రాజా, డీఎస్ వర్మ తెలిపారు.
ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి రోజూ 23 విమానాలు వచ్చి వెళుతున్నాయి. దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు సగటున ఆరు వేల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. విదేశీ సర్వీసులు ప్రారంభమైతే ఈ సంఖ్య పెరుగుతుందని ట్రావెల్ ఐక్యు ప్రతినిధి పి.మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం దుబాయ్ వెళుతున్న వారి కోసం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఇండిగో, ఫ్లై దుబాయ్ సర్వీసులకు టిక్కెట్లు బుక్ చేస్తున్నామన్నారు

Share this on your social network: