చనిపోయిన వ్యక్తికి గత వారం టీకా

Published: Monday October 18, 2021

మరణించిన వ్యక్తికి కరోనా టీకా ధ్రువీకరణ పత్రం జారీ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌ గ్రామానికి చెందిన గుండ మల్లేశం(68)కు కోనరావుపేట అరోగ్య కేంద్రంలో ఏప్రిల్‌ 23న టీకా మొదటి డోసు వేశారు. అనారోగ్య కారాణాల వల్ల ఆగస్టు 7న మృతి చెందాడు. అయితే, ఆయన అక్టోబరు 12న రెండో డోసు టీకా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. కొవిన్‌ పోర్టల్‌ ద్వారా ధ్రువీకరణ పత్రం కూడా జారీ అయ్యింది. కాగా.. టీకా వంద శాతం పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ  చేయడంతో.. సిబ్బంది టీకా వేయకుండానే వేసినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండల వైద్యాధికారి మోహనకృష్ణను వివరణ కోరగా.. ప్రస్తుతం కరోనా టీకాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని చెప్పారు.