బ్రిటన్‌కు వలసపోతున్న సంపన్న భారతీయులు

Published: Sunday October 24, 2021

విదేశీ ప్రయాణం అంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది అమెరికానే! అయితే..ఇటీవల కాలంలో భారత అపర కుబేరులు, విద్యార్థులు, వ్యాపార వేత్తలు బ్రిటన్ వెళ్లేందుకూ మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బ్రెగ్జిట్, కరోనా సంక్షోభం తరువాత.. ఈ ట్రెండ్ మరింతగా పెరిగింది. వలసలకు సంబంధించి కొంతకాలం క్రితం భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన ఒప్పందం కూడా ఈ ట్రెండ్‌కు కారణమవుతోంది. 

భారత్‌కు చెందిన సంపన్నులు.. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు, వాటిని విస్తరించేందుకు బ్రిటన్‌నే ఎంచుకుంటున్నారు. ‘‘బ్రిటన్ బాట పడుతున్న భారతీయ సంపన్నుల సంఖ్య కొంత కాలంగా పెరుగుతూనే ఉంది. బ్రెగ్జిట్ కూడా ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఇక కరోనా సంక్షోభం తరువాత.. అనేక మంది బ్రిటన్‌కు వలసెళ్లేందుకు, అక్కడ ఇళ్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇరు దేశాల్లోనూ ఒకే వ్యావహారిక భాష ఉండటం, అక్కడి స్టాక్ మార్కెట్లు భారతీయులకు సులభంగా అందుబాటులో ఉండటం, వ్యాపారనిర్వహణ కూడా సులువుగా ఉండటం వంటి కారణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు బ్రిటన్‌లో బిజినెస్‌కు మొగ్గుచూపుతారు’’ అని ప్రముఖ ట్యాక్స్ అడ్వైజరీ సంస్థలోని కీలక అధికారి వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో భారతీయ సంతతి వారు అధికంగా ఉండటం, మంచి విద్య, వైద్య సదుపాయాలు కూడా భారతీయ హై నెట్‌వర్త్ వ్యక్తులు(సంపన్నులు) బ్రిటన్‌ను ఎంచుకునేందుకు కారణమవుతున్నాయి. 

 

ఇలా బ్రిటన్‌ను ఎంచుకుంటున్న వారిలో అధిక శాతం సోల్ రీప్రజెంటిటేవ్ ఆఫ్ ఓవరసీస్ బిజినెస్ వీసా ద్వారా బ్రిటన్‌కు వెళుతున్నారు. ఇటీవల భారతీయుల్లో ఈ వీసాకు బాగా పాపులారిటీ పెరిగిందట. దీని ద్వారా విదేశీ వ్యాపారులు బ్రిటన్‌లో ఓ బ్రాంచ్‌ను లేదా అనుబంధ సంస్థను ఏర్పాటు చేయవచ్చు. ఆ బ్రాంచ్‌ను నిర్వహించేందుకు ఓ వ్యక్తిని నామినేట్ చేయవచ్చు. ఇలా నామినేట్ అయిన వారు తమ వెంట జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా.. టైర్-1 ఇన్వెస్టర్ వీసాతో పోలిస్తే చాలా సులభంగా 2 మిలియన్ పౌండ్ల పెట్టుబడితో ఈ వీసా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అనుమతులు కూడా వేగంగా జారీ అవుతాయి. ఈ వీసాపై బ్రిటన్‌కు వెళ్లిన వారు ఐదేళ్ల తరువాత.. శ్వాశ్వతంగా అక్కడ ఉండేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే వారు అత్యధికంగా సోల్ రిప్రజెంటెటేవ్ వీసా, ఇన్వెస్టర్ వీసా, స్టార్టప్ వీసాలకు దరఖాస్తు చేసుకుంటుంటే.. అందులో ఏకంగా 20 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయి.