భారతీయులకు తీపి కబురు..

Published: Tuesday October 26, 2021

అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు తీపి కబురు చెప్పింది. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా తాజాగా ఎత్తివేసింది. నవంబర్ 8 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులు అమెరికా రావొచ్చని, విమానం ఎక్కడానికి ముందు దాని తాలూకు సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుందని సోమవారం వైట్‌హౌస్ ప్రకటించింది. అలాగే వ్యాక్సినేషన్ రేటు 10శాతం కంటే తక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.

"దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కరోనా సమయంలో ప్రయాణాలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం" అని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాకపోతే వారు యూఎస్ వచ్చిన తర్వాత రెండు నెలలకు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది.

 

ఇక అగ్రరాజ్యంలో విమానం దిగిన తర్వాత 72 గంటల ముందు తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు రిపోర్టు చూపించడం కూడా తప్పనిసరి. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు పొందిన టీకాలు తీసుకున్న వారికి మాత్రమే దేశంలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) నిర్ణయించినట్లు సమాచారం. 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.