మోదీకి ఇజ్రాయెల్ పీఎం ఆహ్వానం...

Published: Wednesday November 03, 2021

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో గొప్ప ప్రజాదరణ ఉందని ఆ దేశ ప్రధాన మంత్రి నఫ్టలి బెన్నెట్ అన్నారు. అంతటితో ఆగకుండా తన పార్టీలో చేరాలని మోదీని ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ, భారత దేశాన్ని కాపాడటానికి పీఎం బెన్నెట్‌కు మంచి ఆలోచన వచ్చిందని పేర్కొంది. 

భారత్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రులు మోదీ, బెన్నెట్ స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో సమావేశమయ్యారు. సీఓపీ26 వాతావరణ సదస్సు నేపథ్యంలో వీరిద్దరి మధ్య కాసేపు సంభాషణ జరిగింది. భారత దేశంలో పర్యటించాలని బెన్నెట్‌ను మోదీ ఆహ్వానించారు. 2022 తొలి త్రైమాసికంలో బెన్నెట్ మన దేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానులిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు చిత్రీకరించిన వీడియోను భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మోదీతో బెన్నెట్ మాట్లాడుతూ, ‘‘మీరు ఇజ్రాయెల్‌లో చాలా జనాదరణగల వ్యక్తి, రండి, మా పార్టీలో చేరండి’’ అని ఆహ్వానించినట్లు ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టింది.