కరోనా ప్రభావంతో సరాసరి రెండేళ్ల ఆయుష్షు తగ్గిందంటున్న సర్వేలు

కరోనా మహమ్మారి ఆత్మీయులను, స్నేహితులను దూరం చేసింది. ప్రతి ఒక్కరిని తీవ్ర నిరాశలోకి నెట్టింది. కనిపించకుండానే మనిషిని మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. ఇది ప్రకృతి చేసిన నష్టం కంటే ఎన్నోరెట్లు పెద్దది. ఇటువంటి నష్టాన్ని, కష్టాన్ని దాటి భావితరాలకు సరైన మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రెండు విడతలుగా వచ్చిన మహమ్మారి కారణంగా కొవిడ్ బారినపడి కోలుకున్నవారు భయాన్ని, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆ ఒత్తిడి కూడా ఎక్కువై మానసికంగా కుంగిపోయారు. ఏ స్థాయిలో అంటే... సరాసరి ఆయుష్షును తగ్గించుకునేంత..! అంతేగాక తరువాతి తరాలకు కూడా ఆయుర్దాయం తగ్గించారు. ఈ మధ్యకాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు కూడా దీనిని ధ్రువీకరించాయి.
మహమ్మారి కారణంగా సగటు ఆయుర్దాయం అటు పురుషుల్లోను, ఇటు మహిళల్లోను తగ్గినట్టు ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్(ఐఐపీఎస్) శాస్త్రవేత్తలు గణాంక విశ్లేషణ చేసి ఈ విషయాన్ని గుర్తించారు. కరోనా కారణంగా భారత్‌లో సగటు ఆయుర్దాయం రెండేళ్లు తగ్గినట్టు తమ నివేదికలో తెలిపారు. వీరి నివేదిక ప్రకారం 2019కు ముందు పురుషుల సరాసరి జీవితకాలం 69.5 సంవత్సరాలు కాగా, మహిళల విషయంలో అది 72 ఏళ్లుగా ఉండేది. కానీ 2020లో అది పురుషులకు 67.5 ఏళ్లుగా, స్ర్తీలకు 69.8 ఏళ్లకు తగ్గినట్టు గుర్తించారు. కరోనా 39-69 ఏళ్ల వయస్సు ఉన్న పురుషుల ప్రాణాలను ఎక్కువుగా హరించింది. దీని వల్ల సగటు ఆయుర్దాయం పడిపోయింది. ఏదో ఒక మహమ్మారి విజృంభించినపుడల్లా సగటు జీవితకాలం తగ్గిపోతుందని హెచ్‌ఐవీ సమయంలో కూడా ఇదే జరిగిందని తమ నివేదికలో పేర్కొన్నారు.
కరోనా సమయంలో ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల కఽథనాలు(డూమ్ స్ర్కోలింగ్) వంటివి ఎక్కువశాతం చూడటం భారతీయుల జీవితకాలం తగ్గిపోవడానికి మరో కారణంగా ఐఐపీఎస్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే కొవిడ్ ప్రతికూల కథనాలను ఒకదాని తరువాత ఒకటిచూసుకుంటూ ఉండటమే డూమ్‌స్ర్కోలింగ్. దీని కారణంగా భావోద్వేగ సమతుల్యత, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయి. అంతేగాక అదేపనిగా వీటిని చూడటంవల్ల దీర్ఘకాలిక రుగ్మతలకు గురయ్యే ప్రమాదముంది. కొవిడ్ ప్రతికూల వార్తలను తక్కువలో తక్కువుగా 2-4 నిమిషాలు చూసినా మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. ఎక్కువమంది భారతీయులు ఇటువంటి వీడియోలే చూడటంతో పాటు, వాటి గురించి చర్చించారని అందుకే మన దేశంలోనే డూమ్ స్ర్కోలింగ్ బాధితులు ఎక్కువుగా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
పరిష్కారం మన చేతుల్లోనే...
వాస్తవానికి కరోనా వార్తలను అసలు పట్టించుకోని వారిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కొవిడ్ గురించి అనేక మార్గాల ద్వారా తెలుసుకునే వారే ఇటువంటి ప్రభావానికి లోనయ్యారు. ఎక్కువుగా వాటి గురించే వెతకడం, చర్చించడం వల్లే ఇటువంటి ఒత్తిడి బారినపడ్డారు. సామాజిక మాధ్యమాలను విజ్ఞానం కోసం, వాస్తవ సమాచారం తెలుసుకోవడానికి, స్ఫూర్తిదాయక కఽథనాలకోసం, జీవితంలో జరిగే శుభపరిణామాలను పంచుకోవడానికి, ఇతరులను అభినందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
మనమేం చేయాలి..
- ముఖ్యంగా రోజు అరగంట సేపు లేదా వారంలో కనీసం 150 నిమిషాలైనా వ్యాయామానికి కేటాయించాలి.
- పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
- కుటుంబం సహా ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇటువంటి వాటితో ఒత్తిడిని కొంతమేర దూరం పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- కఠిన సమయాల్లో పుస్తకాలు చదవడం మంచి మార్గమని నిపుణులు సలహాలిస్తున్నారు. అపజయాల నుంచి నేర్చుకునే పాఠాలు, స్ఫూర్తిదాయ కఽథలు, విజేతల గాధలు వంటి పుస్తకాలు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి.
- అంతేగాక స్తోమతకు తగ్గ సేవాగుణం కూడా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే విమర్శలు, ఇతరుల గురించి అదేపనిగా చర్చించడం వంటి వాటికి దూరంగా ఉంటూ మెరుగైన జీవనప్రమాణాలను పాటించాలి.
కొవిడ్ వైరస్ సృష్టించిన విధ్వంసం... దాని వల్ల జరిగిన నష్టాలు చరిత్రలో ఎప్పటికీ ఉంటాయి. అదృష్టమో, దురదృష్టమో కాని దానికి అందరం సాక్షులుగా ఉన్నాం. దీని తాలుకా భయాలను పోగొట్టే బాధ్యత కూడా మనదే. కరోనా కంటే దాని గురించి జరిగిన ప్రచారం ఎక్కువుగా ఆందోళనకు గురిచేసింది. వీటన్నిటినుంచి సాధ్యమైనంత వరకు బయటపడాలి. ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న ఆనందాలను కూడా గొప్పగా భావించాలి.

Share this on your social network: