రాష్ట్రవ్యాప్తంగా నిరసన: చంద్రబాబునాయుడు
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళవారం 12 గం.ల నుంచి 1 గం. వరకు నిరసన కార్యక్రమం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసారు. హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని ఆయన డిమాండ్ చేసారు. పక్క రాష్ట్రాల్లో తగ్గించినా, మన రాష్ట్రంలో మొండిచేయి చూపారన్నారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు, ఉపాధి రాదన్నారు. అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుందన్నారు.
అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారన్నారు. లారీల యజమానులు, కార్మికులు దెబ్బతినడమే కాక రవాణ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయన్నారు. పెట్రో భారాలకు ప్రభుత్వ దోపిడీ, దుబారాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయన్నారు. దేశంలో అధికంగా పెట్రోల్ ధర రూ.110.98కి పెంచారు. కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.

Share this on your social network: