NRI బ్యాంక్ అకౌంట్లోంచి రూ.14 లక్షలు మాయం.

తన బ్యాంకు అకౌంట్ వివరాలు చూసుకున్న ఓ ఎన్నారైకి ఊహించని షాక్ తగిలింది. తాను ఏటీఎంకు వెళ్లకపోయినా, ఎవరికీ చెక్కులూ గట్రా ఇవ్వకపోయినా.. ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయకపోయినా కూడా ఏకంగా 14 లక్షలు మటుమాయామయ్యాయని తెలిసి అతడికి ఏం చేయాలో పాలు పోలేదు. మూడు విడతల్లో ఈ మొత్తం విత్‌డ్రా అవగా.. చిట్టచివర్లో ఆయనకు విషయం తెలిసింది. దీంతో.. కంగారు పడిపోయిన ఆయన జరిగిన విషయాన్ని తన బంధువుకు చెప్పాడు. అసలేం జరిగిందో ఆరా తీయమని కోరాడు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు ఆ ఎన్నారైని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. లూథియానాకు చెందిన రామ్‌నీక్ తూర్ అనే ఎన్నారై ఎదుర్కొన్న పరిస్థితి ఇది.
ఏఎస్ఐ సుర్జిత్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. బ్యాంకు డిప్యుటీ మేనేజర్ అభిషేక్ వాలియా, కేషియర్ అంకిత, క్లర్క్ దీపక్ భట్, పవన్‌దీప్ కౌర్ల కలిసి రామ్‌నీక్ తూర్ పేర కొత్త చెక్ బుక్‌ను జారీ చేయించుకున్నారు. ఆపై బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా డబ్బును కాజేశారు. కాగా..పోలీసులు నిందితులపై సెక్షన్ 409, 120ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Share this on your social network: