దేశ సరిహద్దులు దాటిన పేదల బియ్యం

కైకలూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి మాయమైన బియ్యం బస్తాల్లో మూడొంతులు కాకినాడ పోర్టుకు చేరాయని, అక్కడి నుంచి బియ్యం పండించని ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని సమాచారం. ఈ వ్యవహారంలో బడా మాఫియా హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మాఫియా చేతిలో సివిల్ సప్లయిస్ అధికారులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ మాఫియా ఎవరు? సివిల్ సప్లయిస్‌లో ఈ మాఫియాకు సహకరిస్తున్న బాస్ ఎవరు? బాస్ చెప్పినట్టు ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లు చేస్తున్నారా? వీరే నేరుగా మాఫియాతో సంబంధాలు కొనసాగిస్తున్నారా? అనేది నిగ్గు తేలాల్సి ఉంది.
కైకలూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో వెలుగు చూసిన అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలతో విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ ఏర్పడక ముందే బయట నుంచి ఐదు లారీల్లో బియ్యాన్ని తీసుకువచ్చారు. దీనిపై మళ్లీ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో గోడౌన్‌కు రెండో తాళం వేశారు. దీంతో బయటి నుంచి బియ్యం తీసుకురావటం ఆగింది. విచారణ కమిటీ రంగంలోకి దిగి, ఇక్కడి నుంచి మొత్తం 12000 బియ్యం బస్తాలు, ఇతర నిత్యావసరాలు మాయం అయ్యాయని గుర్తించింది. ఇదే సమయంలో మొవ్వ, అవనిగడ్డ, జి.కొండూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో కూడా లెక్కలను తారుమారు చేశారు. గొల్లపూడి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు బయట నుంచి బియ్యాన్ని తెచ్చి సర్దుకున్నారు.
ఇప్పటి వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లంతా కలిసికట్టుగా ఒక నెట్‌వర్క్‌గా పనిచేస్తూ గోడౌన్లలోని పేదల బియ్యాన్ని తరలించేస్తున్నారని అర్థమవుతోంది. వీరందరికీ సివిల్ సప్లయిస్‌లో ఎవరో సహకరిస్తున్నారు. వారెవరనేది తేలాల్సి ఉంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిలు బాస్ కనుసన్నల్లోనే పని చేస్తున్నారా? వీరే స్వయంగా ఈ పని చేస్తున్నారా? అనేది నిగ్గుతేల్చాల్సి ఉంది. కైకలూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో మాయమైన వేలాది బియ్యం బస్తాల్లో సింహభాగం కాకినాడ పోర్టుకు చేరినట్టు సమాచారం. అక్కడి నుంచి ఈ బియ్యం విదేశాలకు తరలిపోయిందని తెలుస్తోంది. దీనిని బట్టి ఈ వ్యవహారం వెనుక బడా ట్రేడర్ల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రాకెట్‌లో కీలక వ్యక్తులు ఎవరు? సూత్రఽఽధారులు ఇక్కడివారా? బయటివారా? అనేది తేలాల్సి ఉంది. కాకినాడ తరలించగా మిగిలిన బియ్యం బస్తాలను స్థానికంగా పలు మిల్లులకు తరలించినట్టు తెలుస్తోంది. మిల్లర్లు వీటిని తక్కువ ధరకు తీసుకుని, కాస్త పాలిష్ పట్టించి, మళ్లీ రెట్టింపు ధరకు జిల్లా యంత్రాంగానికే విక్రయిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని పట్టుకోవడంతో పాటు, కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి విదేశాలకు తరలించే రాకెట్ వ్యవహారాన్ని కూడా ఛేదించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.

Share this on your social network: