ప్రశ్నించటమూ మన సంస్కృతే!

Published: Wednesday December 15, 2021

దేశ రాజధానిలో చలి దట్టంగా అలముకుంటున్న వేళ ప్రతిపక్షాల్లోను, ఉద్యమాల్లోనూ వేడి తగ్గినట్లు కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు నిస్సారంగా, యాంత్రికంగా సాగుతున్నాయి. ఎటువంటి కార్యాచరణకు పూనుకోవాలో తెలుసుకోలేని అయోమయంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. గత సమావేశాల్లో గందరగోళం సృష్టించి ఈ సమావేశాల్లో సస్పెండైన 12మంది విపక్షసభ్యులు రెండు వారాలుగా ప్రతి రోజూ గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన జరుపుతున్నా పెద్దగా పట్టించుకునేవారు లేరు. ఈ అంశంపై రాజ్యసభ అప్పుడప్పుడూ వాయిదాపడుతున్నా ఉభయసభల్లో బిల్లులు యథాప్రకారం ఆమోదం పొందడం ప్రతిపక్షాల మధ్య చీలికను సూచిస్తోంది. రాజ్యసభలో మంగళవారం కొంతమంది సభ్యులు వెల్‌లోకి వచ్చి సభ్యుల సస్పెన్షన్ రద్దు చేయాలని నినాదాలు చేస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ నేత సుఖేందురాయ్ సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఉభయ సభల మీడియా గ్యాలరీలు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ప్రధాని కనుసన్నల్లో ప్రారంభమైన సంసద్ టీవీని పెద్దగా చూసేవారు లేరు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా నిరసన ప్రదర్శనలు జరిపిన రైతులు శిబిరాలు తొలగించి ఇళ్లకు వెళ్లిపోవడంతో పోలీసులు కూడా బారికేడ్లను తొలగించి వాహనాల రాకపోకలకు వీలు కల్పించారు. ‘గ్రామాలకు గ్రామాలే తొలగించినట్లు కనపడుతున్నాయి..’ అని స్థానికుడొకరు వ్యాఖ్యానించారు

 

ఉన్నట్లుండి పరిస్థితి ఇలా దాదాపు సద్దుమణగడాన్ని తుఫాను ముందు ప్రశాంతతగా అభివర్ణించవచ్చా? చెప్పలేము. ప్రధానమంత్రి మోదీ తానే స్వయంగా ప్రజల ముందుకు వచ్చి సాగుచట్టాలను ఉపసంహరించుకుని, ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించిన తర్వాతనే రైతులు శాంతించారు. ఈ ఉపసంహరణ విషయం మాత్రమే కాదు, మరే విషయంలోనైనా పార్లమెంట్‌కు ప్రధానమంత్రి వివరించేది ఏమీ లేదని, తామెంత గగ్గోలుపెట్టినా అరణ్యరోదనే అవుతుందని, తమ ప్రశ్నలకు పార్లమెంట్‌లో జవాబులు రావని ప్రతిపక్షాలకు రానురానూ అర్థమవుతోంది. పార్లమెంట్ సాగుతుండగానే మోదీ తన మానాన తాను ఉత్తర ప్రదేశ్‌లో పర్యటనలు జరుపుతూ ప్రజల మనోభావాలను బిజెపి వైపు తిప్పేందుకు ఉధృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు పార్లమెంట్‌తో పెద్దగా పనిలేదు. పార్లమెంట్‌కు క్రమం తప్పకుండా హాజరు కావాలని, లేకపోతే మళ్లీ సీట్లు ఇవ్వడం కష్టమని తమ పార్టీ ఎంపీలను గత వారం హెచ్చరించిన మోదీ తాను మాత్రం పార్లమెంట్‌కు హాజరు కావడం తన విధ్యుక్త ధర్మంగా భావించడం లేదు. రెండురోజుల క్రితమే సరయా నహర్ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ సోమవారం తన నియోజకవర్గంలో కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించి కాశీ వీథుల్లో జనం దృష్టిని ఆకర్షించే అనేక పనులు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రజల భావోద్వేగాల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించే నేతల్లో తనను మించిన వారు లేరని మోదీ మరోసారి నిరూపించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వందలాది ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుల్ని ఆహ్వా నించడం, వారితో వారణాసిలో హోటళ్లు, అతిథిగృహాలు కిక్కిరిసిపోవడం, మంత్రులందర్నీ జ్యోతిర్లింగాల పూజకు పంపడం మోదీ ఎవరి మద్దతుపై బలంగా ఆధారపడ్డారో అర్థమవుతుంది.

 

మోదీ భారతదేశ పూర్వవైభవాన్ని పునరుజ్జీవింపచేస్తున్నారని, సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని కాశీ, అయోధ్య, సోమనాథ్ తదితర ఐతిహాసిక స్థలాలను పునరుద్ధరించారని ఆనందపరవశులవుతున్నవారు ఇదే భారతీయ సంప్రదాయంలో భాగమైన ప్రశ్నించే సంస్కృతిని విస్మరిస్తున్నారు. మన ఉపనిషత్తుల్లోనే ప్రశ్నించే తత్వం ఉన్నది. ప్రశ్న- జవాబుల ఆధారంగానే ఉపనిషత్తులను రచించారు. గార్గి, మైత్రేయ లాంటి స్త్రీలు కూడా ఈ ప్రశ్నల పరంపరలో పాల్గొన్నారు. అసలు మనకు ప్రశ్నోపనిషత్తు పేరుతోనే ఒక ఉపనిషత్తు ఉన్నది. దేవుడి ఉనికిని కూడా ప్రశ్నించినవారున్నారు. ప్రశ్న, అన్వేషణల ద్వారానే మనం శాస్త్రీయదృక్పథాన్ని, గణితాన్ని, భౌగోళిక శాస్త్రాల్ని ప్రపంచానికి చాటి చెప్పాము. ఈ మహత్తర విషయాలను మనం మరిచిపోయాం. సాగుచట్టాల్ని ఎందుకు తెచ్చారు, ఎందుకు ఉపసంహరించుకున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అన్న ప్రశ్నలకు పార్లమెంట్‌లోనే సమాధానం లభించనప్పుడు బయట లభిస్తాయనుకోవడం అమాయకత్వం. ఆక్సిజన్ అందక మరణించిన వారి లెక్కలు కానీ, నిరసన ప్రదర్శనల్లో మరణించిన రైతుల వివరాలు కానీ ప్రభుత్వం వద్ద ఉండవు. అసలు అలాంటి మరణాల సమాచారమే తమ వద్ద లేవనే సమాధానం వస్తుంది. రిలయన్స్, స్పెన్సర్, బిగ్‌బజార్ ఇత్యాది పెద్ద వ్యాపారసంస్థలు అత్యధికంగా పంట ఉత్పత్తులను సేకరించడం ద్వారా మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని ఆహార, ప్రజాపంపిణీ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే, ఏ నిత్యావసర ఆహార వస్తువుల నిల్వలపై పరిమితులు లేవని, కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని సమాధానం లభించింది. 2010–-11 నుంచి 2018-–19 వరకు పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రూ.76,547కోట్ల నుంచి రూ.2,29,247కోట్లకు, కస్టమ్స్ సుంకం రూ.26,282కోట్ల నుంచి రూ.39,123కోట్లకు పెరిగిందని, ఇతర దేశాల్లో ఈ విషయంలో అనుసరిస్తున్న పద్ధతులకు అనుగుణంగా మన దేశంలో ధరలను సమీక్షించుకోవాలని ఈ స్థాయీసంఘం సూచిస్తే ఆ మొత్తాన్ని మౌలిక సదుపాయాలకు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతున్నామని కేంద్రం స్పష్టంగా సమాధానం చెప్పింది. అంతేకాక వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చుకోవడం కోసమే 2021-–22లో వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను మోపామని ప్రభుత్వం ఖండితంగా సమాధానం చెప్పింది. సమర్థమైన ఆర్థిక నిర్వహణ ద్వారా వనరులను సమకూర్చాల్సిన ప్రభుత్వం ప్రజలపై భారం మోపి మౌలిక సదుపాయాలకు ఖర్చుపెడుతున్నామని చెప్పుకోవడం విడ్డూరం. ఇదే ప్రభుత్వం ఈ ఏడాది మార్చి అంతానికి రూ.2,02,781 లక్షల కోట్ల మేరకు వ్యాపారవేత్తల మొండిబాకీలను రద్దు చేశామని, గత ఏడేళ్లలో రూ. 10.72 లక్షలకోట్లకు పైగా బకాయీలను రద్దు చేశామని రిజర్వు బ్యాంకు సమాచార హక్కు క్రింద వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. రద్దు చేసిన బకాయీల్లో 75శాతం ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందినవే. సాధారణంగా ఎంతో ప్రయత్నించి, సాధ్యమైనంత మేరకు వసూలు చేసుకున్న తర్వాత బ్యాంకులు మొండి బాకీల రద్దు విషయం ఆలోచిస్తాయి. కాని మోదీ హయాంలో రుణాల రద్దు విషయంలో పారదర్శకత లేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సంస్థల రుణాలు అవలీలగా రద్దు అవుతుంటే, చిన్నసంస్థల పట్ల బ్యాంకులు ఎలాంటి జాలి చూపించడం లేదు. కార్పొరేట్ సంస్థల నుంచి ముక్కుపిండి బకాయీలు వసూలు చేసే బదులు ప్రజలపై భారీ పన్నుల భారం ఎందుకు మోపుతున్నారని, అవే సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు అమ్మ జూపుతున్నారని అడిగే ప్రశ్నలకు సమాధానం లభించదు.

 

మోదీ కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బ్యాంకులు మునిగిపోతే గతంలో రూ. లక్ష వరకే ప్రభుత్వం హామీ ఇచ్చేదని, ఈ మొత్తాన్ని తాము రూ.5లక్షలవరకు పెంచామని ప్రకటించారు. కాని బ్యాంకుల్లో అధికంగా డబ్బు జమ చేసుకున్నవారి గతేమిటి? అసలు గతంలో రూ.లక్ష వరకు గ్యారంటీ ఇచ్చినప్పటికీ బ్యాంకులు మునిగిన దాఖలాలు లేవు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తర్వాత ఒక్క బ్యాంకు కూడా దివాలా తీయలేదు. దేశమంతటా ప్రైవేట్, విదేశీ బ్యాంకులు తెరిచిన తర్వాత కూడా 87శాతం మంది ప్రజలు ప్రభుత్వ బ్యాంకుల్లో డబ్బులు జమ చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు మూసివేతకు గురైనా, భారతీయ బ్యాంకులు దెబ్బతినలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అయిదు బ్యాంకులు, అనేక ఆర్థిక సంస్థలు దెబ్బతిన్నాయి. లక్ష్మీ విలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు, యస్ బ్యాంకు తదితర బ్యాంకులనుంచి డిపాజిటర్లు తమ డబ్బు తాము విత్ డ్రా చేసుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అవలంబించిన తప్పుడు ఆర్థిక విధానాలద్వారా బ్యాంకులు నష్టాల బారినపడితే వాటిని విలీనం చేయడమో లేక మొండి బాకీలు రద్దు చేసి వాటి బ్యాలన్స్ షీట్లు మెరుగ్గా ఉన్నాయని చూపించుకోవడమో చేస్తున్నారు. బ్యాంకులు మునిగిపోతే రూ.5 లక్షలవరకు గ్యారంటీ ఇస్తామని చెప్పే బదులు మోదీ అసలు బ్యాంకులే మునిగిపోవని ఎందుకు గ్యారంటీ ఇవ్వలేరు? బ్యాంకులపై పర్యవేక్షణ జరపాల్సిన బాధ్యత రిజర్వు బ్యాంకుది. దేశంలో అత్యధిక మొత్తం ఆర్జించే సంస్థ అయిన రిజర్వు బ్యాంకు రిజర్వులనుంచే కేంద్రం గత కొద్ది సంవత్సరాలుగా తమ పబ్బం గడుపుకుంటున్న మాట నిజం కాదా? 2020–-21లోనే రిజర్వు బ్యాంకు రూ. 99,122 కోట్ల మిగులును భారత ప్రభుత్వానికి బదిలీ చేసిందని, ఆర్థిక మంత్రి స్వయంగా సోమవారం లోక్‌సభకు వెల్లడించారు. కేంద్రానికే భారీ మిగులును బదిలీ చేసే రిజర్వు బ్యాంకు సంస్థ ఉండగా బ్యాంకులు ఎందుకు దివాలా తీయాలి? దేశంలో సామాన్య ప్రజలు బ్యాంకుల్లోడబ్బు జమ చేసుకుంటే బడా సంస్థలు బ్యాంకులనుంచి వేలకోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వం ఎవరి పక్షం వహించాలి? ఆలయాలు పునరుద్ధరిస్తే ప్రజలు భక్తిపారవశ్యంలో పడి ప్రశ్నించే స్వభావం ఎల్లవేళలా కోల్పోతారనుకోవడం అమాయకత్వమే!