విచారణకు రారేం?.ప్రతిసారీ గైర్హాజరీ పిటిషనా?..

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోర్టు విచారణకు అసలు రారా.. ప్రతిసారీ విచారణ సమయంలో గైర్హాజరు పిటిషన్ వేయడం ఏమిటని సీబీఐ ప్రత్యేక కోర్టు నిలదీసింది. ఆయన తీసుకున్నది షరతులతో కూడిన (కండిషనల్) బెయిల్ మాత్రమేనని స్పష్టం చేసింది. మంగళవారమిక్కడ నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. హెటిరో, అరబిందో కేసుల విచారణ సందర్భంగా కోర్టు 15 నిమిషాల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఈ కేసుల్లో జగన్ తీసుకున్నది కండిషనల్ బెయిలే కదా? విచారణకు వచ్చి సహకరిస్తానని బెయిల్ ఇచ్చే సమయంలో నిందితుడు అంగీకరించారు’ అని న్యాయమూర్తి గుర్తుచేశారు. జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి స్పందిస్తూ.. బెయిల్ తీసుకున్న సమయంలో జగన్ ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రస్తుతం ఆయన సీఎంగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా పాలనలో బిజీగా ఉంటున్నందున కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. పాలనా పనులతో పాటు ప్రొటోకాల్ ప్రకారం భద్రతాపరమైన సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని.. సీఎం హోదాలో ఉన్న ఆయన్ను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఎక్కువ మంది వస్తారని వివరించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై తీర్పు రావలసి ఉందని చెప్పారు. ఈ వాదనలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి వాయిదాకూ ఒకే కారణం చెబుతున్నారని ఆక్షేపించింది. అలాగే ఒకే తరహాలో సమాధానం, వివరణ ఇవ్వడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోరుతోందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన అంశాన్ని లిఖితపూర్వకంగా నివేదించాలని జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. దీనికి సంబంధించి సీబీఐ న్యాయవాది మెమో దాఖలుచేశారని అశోక్‌రెడ్డి చెప్పారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో ఏ-12గా ఉన్న ఐఏఎస్ అధికారి మురళీధర్‌రెడ్డి పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. పిటిషనర్ తరఫున న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురు ప్రభుత్వ అధికారులకు ఇదే హైకోర్టు విముక్తి ప్రసాదించిందని తెలిపారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ప్రాసిక్యూట్ చేయరాదన్న నిబంధనలను సీబీఐ ఉల్లంఘించిందన్నారు. మురళీధర్‌రెడ్డిని విచారించేందుకు ప్రభుత్వం అనుమతించలేదని పేర్కొన్నారు. తనపై నమోదైన సీబీఐ కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Share this on your social network: