పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు

రాష్ట్రంలో ఒక్కసారిగా పదిరోజుల నైట్‌కర్ఫ్యూ విధించడం లాక్‌డౌన్‌కు సంకేతమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవై నెలలుగా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ కొత్తవేరియంట్ ఒమైక్రాన్‌గా రెండునెలల వ్యవధిలోనే పలు దేశాలలో భారీగా విస్తరించింది. దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన వైరస్ ఇప్పటికే పదుల సంఖ్య దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఒమైక్రాన్ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా పరిశోధనల దశలోనే ఉండడం... దేశవ్యాప్తంగా రోజూ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరగనప్పటికీ ఒమైక్రాన్ ఎటువంటి పరిణామాలు చూపనుందోనని ముందుగా 10 రోజుల నైట్‌కర్ఫ్యూను ప్రకటించారు. మంగళవారం నుంచి జనవరి మొదటివారం దాకా నిబంధననలు అమలులో ఉంటాయి. దేశంలో తొలి ఒమైక్రాన్ కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తితో పాటు బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్‌కు నిర్ధారణ అయింది. ఆ తర్వాత రాష్ట్రంలో కేసుల పరంపర సాగుతూనే ఉంది. శుక్రవారం దాకా 31 మందికి ఒమైక్రాన్ వైరస్ ప్రబలగా శనివారం ఒక్కసారిగా 8 మందికి సోకింది. వీరిలో ఇద్దరు కతార్ నుంచి వచ్చినవారు కాగా మిగిలిన ఆరుగురు లండన్ నుంచి వచ్చినవారే. ఎయిర్ పోర్టులోనే వీరికి పాజిటివ్ నిర్ధారణ కాగా జినోమి సీక్వెన్సీకి పంపగా పాజిటివ్‌గా తేలింది. ఇలా రాష్ట్రంలో ఒమైక్రాన్ బాధితులు 39 మంది అయ్యారు. వీరిలో దాదాపు 15 మందికి పైగా కోలుకున్నవారే ఉన్నట్లు సమాచారం. శాసనసభ సమావేశాలు శుక్రవారం దాకా బెళగావిలో జరిగాయి. అప్పటి దాకా రాష్ట్రంలో ఎటువంటి నిబంధనలు పాటించాలనే నిర్ణయం తీసుకోలేదు. కానీ క్రిస్మస్, కొత్తసంవత్సర వేడుకలకు మాత్రమే ఆంక్షలు పెట్టారు. ఒక్కరోజులోనే పూర్తిగా నిబంధనలు మార్చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులతో సమీక్ష నిర్వహించి ఆంక్షల అమలుకు సిద్ధమయ్యారు. రాత్రి కర్ఫ్యూ అమలులోకి తీసుకురావడంతో పాటు సభలు, సమావేశాలు, వివాహాలకు ఇప్పటి దాకా ఉండే 500 మంది నుంచి 300 మందికి తగ్గించారు. రాత్రి కర్ఫ్యూ అమలులోకి రావడంతో మరో రెండు రోజుల తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయో అనే భయం ప్రజలలో వెంటాడుతోంది. విద్యాసంస్థలపై ప్రభావం చూపనుందా అనేది కూడా హాట్‌టాపిక్‌గా మారింది. గడిచిన 20 నెలల వ్యవధిలో రెండు విడతల కొవిడ్ కాలంలోను భారీ అంక్షలు అమలు చేసేందుకు ముందు నైట్‌కర్ఫ్యూతోనే ప్రజలను చైతన్యపరస్తూ వచ్చారు. కొన్ని దేశాలలో రోజూ వేలకు వేల ఒమైక్రాన్ కేసులు నమోదవుతుండటంతో అటువంటి పరిస్థితి కర్ణాటకలో మరెంతో కాలంలో లేదని జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి నాటికి వేలకు వేలు కేసులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిణామలన్నింటినీ పరిశీలిస్తే సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పెను నిబంధనలు తప్పవనిపిస్తోంది. అది లాక్‌డౌన్ దాకా వెళుతుందా అనేది కుతూహలంగా మారింది.

Share this on your social network: