శాంతికి చిహ్నమైన పావురాలు కలకలం

Published: Thursday January 06, 2022

శాంతికి చిహ్నమైన పావురాలు కలకలం రేపాయి. కాళ్లకు ట్యాగ్‌లు ఉండగా, వాటిపై చైనా లిపితో రాసి ఉంది. నాలుగు నెలల కింద తిరుపతి సమీపంలో, తాజాగా ప్రకాశం జిల్లాలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇలాంటి పావురాలు కనిపించాయి. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో ఆరా తీశాయి. అవి చెన్నై క్లబ్‌వని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతం తీరంలో నాలుగు నెలల్లో ఇలాంటి మూడు పావురాలు కనిపించాయి. నాలుగు నెలల క్రితం తిరుపతి-కడప మార్గంలో ఒక పావురం కాలికి ఇలానే ట్యాగ్‌ కనిపించింది. అప్పట్లో దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నెల రోజుల క్రితం ఒడిశాలో ఇలాంటిదే మరో పావురం కనిపించింది. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కనిపించిన పావురం ట్యాగ్‌ స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది. విషయం తెలియగానే కేంద్ర నిఘా వర్గాలు పావురం జాతి, వయసు, ట్యాగ్‌లో ఉన్న వివరాలు, ఇతరత్రా పూర్తి సమాచారం సేకరించాయి. పావురాల కాళ్లకు అమర్చిన ట్యాగ్‌లపై ఔౖఊఖీ 26, అఐఖ 2019, ఐూ 2021వైజాగ్‌, గఏఊ 19742021 అంటూ రాసిన అక్షరాలను విశ్లేషించాయి. చైనా వేగులు ఏదైనా సమాచార సేకరణకు పంపారా అనే కోణంలోనూ విచారించాయి. నేవీ అధికారులు కూడా ఏపీ, ఒడిశా పోలీసులతో మాట్లాడినట్టు సమాచారం. చివరికి చైన్నెకి చెందిన ఓ క్లబ్‌ నుంచి పావురాలు ఇటు వచ్చాయని తేలింది. 

చీమకుర్తిలోని ఎంఎన్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌ్‌సపై కాలికి రబ్బరు ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని అపార్ట్‌మెంట్‌ యజమాని మన్నం నాగరాజు బుధవారం గమనించారు. ట్యాగ్‌పై ఏఐఆర్‌ 2019 2207 అనే కోడ్‌ ఉండటంతో రెవెన్యూ, పోలీస్‌, మీడియాకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడికి చేరుకొని రెక్కకు దిబ్బ తగిలి ఎగరలేకపోతున్న పావురాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టి అది చెన్నైలోని ఆల్‌ఇన్‌ పీజియన్‌ రేసింగ్‌ సొసైటీదిగా సాయంత్రానికి పోలీసులు గుర్తించారు. పావురాన్ని తీసుకెళ్తామని సంస్థ తెలపడంతో అప్పటి వరకు దాన్ని అటవీశాఖ సంరక్షణలో ఉంచారు. కాగా.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో బుధవారం రైతుల పొలాల్లో ఆరబోసిన ధాన్యంపై పావురాలు వాలాయి. వాటిలో ఓ పావురం విభిన్నంగా కనిపించడంతో రైతులు పట్టుకొని చూశారు. దాని కాలికి మాండరిన్‌ లిపితో కూడిన బ్యాడ్జ్‌ చుట్టివుంది. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.