ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ ఆందోళన

Published: Thursday January 06, 2022

రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ అన్నారు. కోటవురట్లలోని కేజీబీవీ, ప్రభుత్వ హైస్కూల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జల్లూరు, పామువాక, కె.వెంకటాపురం ఉన్నత పాఠశాలలను బుధవారం  సందర్శించి ఇక్కడ మాట్లా డారు. ఎయిడెడ్‌ పాఠశాలలను రద్దు చేసి, వాటిలో పనిచేసే టీచర్లతో ఖాళీలు భర్తీచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీనివల్ల కొత్త పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో పాటు నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని  జగన్‌ హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. పీఆర్‌సీ అమలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం ఇంత జాప్యం చేయలేనద్నారు.  ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు ఎస్‌.దాసు, ఎం.కృష్ణప్రసాద్‌, లచ్చబాబు, రమణ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని రెండు వేర్వేరు పాఠశాలల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఇద్దరు టీచర్లను ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు ఇక్కడి క్రీస్తుకృపాలయ బాప్టిస్టు చర్చి ఆవరణలో సత్కరించారు.  వైసీపీ నాయకులు పైల రమేష్‌, యల్లపు కుమార్‌రాజు, సర్పంచ్‌ అనిల్‌కుమార్‌, మట్ల ఆనందరాజు, కో-ఆప్షన్‌ సభ్యురాలు సువర్ణలత పాల్గొన్నారు.