విమానాన్ని ఢీకొట్టిన రైలు..

అమెరికాలోని లాస్‌ఏంజిలెస్‌లో ఓ విమానం రైలు పట్టాలపై కుప్పకూలింది. క్యాబిన్‌లో చిక్కుకుపోయి రక్తమోడుతున్న పైలట్‌ను పోలీసులు ఇలా బయటకు తీశారో, లేదో రైలు అలా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమాన శకలాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందుకు సంబంధించి ‘రాయిటర్స్’ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతోంది.
కుప్పకూలిన విమానంలో చిక్కుకుపోయిన పైలట్‌ను పలువురు అధికారులు రక్షించడం, ఆ మరుక్షణమే రైలు వచ్చి విమానాన్ని ఢీకొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రైలు ఢీకొట్టినప్పుడు పైలట్, అతడిని రక్షిస్తున్న అధికారులు దానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారు.
పకొయిమా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం రైలు పట్టాలపై క్రాష్ ల్యాండ్ అయింది. విమానం టేకాఫ్ తీసుకోవడంలో విఫలమై రైలు పట్టాలపై కుప్పకూలిందని ఈ వీడియోను షూట్ చేసిన 21 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్ లూయిస్ జిమెంజ్ పేర్కొన్నాడు. ఘటన జరిగిన క్షణాల్లోనే స్పందించిన పోలీసులు పైలట్‌ను రక్షించారని, రైలు ఢీకొన్న తర్వాత చెల్లాచెదురుగా ఎగిరిపడిన శకలాల్లో ఒకటి తనను కూడా తాకిందని చెప్పాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పైలట్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. అలాగే, రైలులో ఉన్న వారిలో ఏ ఒక్కిరికీ గాయాలు కాలేదని పేర్కొంది. లాస్‌ఏంజెలెస్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పైలట్‌ను రక్షిస్తున్న వీడియోను పోస్టు చేశారు. క్షణాల్లోనే స్పందించి పైలట్‌ను రక్షించిన అధికారులను పోలీస్ డిపార్ట్‌మెంట్ అభినందించింది.

Share this on your social network: