ఓటీఎస్ లక్ష్యాన్ని చేరుకోలేదని నగరి కమిషనర్‌పై కలెక్టర్ ఫైర్
‘నువ్వు సెలవు పెట్టి వెళ్లిపో! రేపటి నుంచి జిల్లాలో ఉండకూడదు. లక్ష్యం పూర్తి చేయకపోయినా ఫర్వాలేదు. కానీ, జిల్లాలో ఉండొద్దు. బయల్దేరు’’ అంటూ చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబుపై జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ‘‘నువ్వు జిల్లాలో పనిచేసేందుకు నేను ఒప్పుకోను. మెడికల్ లీవ్ పెడతావో.. ఇంకో లీవ్ పెడతావో.. పెట్టుకో. నిన్ను కొనసాగించవద్దని డెవల్‌పమెంట్ జేసీకి కూడా చెప్తాను’’ అంటూ నిప్పులు చెరిగారు. దీనికి కారణం ఓటీఎస్ లక్ష్యం చేరుకోకపోవడమే. ప్రభుత్వ పెద్దలు ఓటీఎస్ బలవంతం కాదని, స్వచ్ఛందమేనని పైకి చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో అధికారులకు విధిస్తున్న లక్ష్యాలకు ఈ ఘటన అద్దం పడుతోంది. ఇటీవల చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఓటీఎస్ వసూళ్లలో పురోగతి సాధించలేకపోయిన వారిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరి కమిషనర్ కలెక్టర్‌తో మాట్లాడుతూ.. ‘‘మాకు 591 మంది ఉంటే 105 మందిని ఒప్పించాం సార్.. మిగతా ఫైల్స్ కూడా రెడీ చేస్తున్నాం సర్’’ అని చెప్పారు. దీంతో కలెక్టర్ పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాయిస్ రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్‌ను కూడా కలెక్టర్ ఇంతకంటే దారుణంగా హెచ్చరించినట్లు తెలిసింది.
నలిగిపోతున్న అధికారులు, సిబ్బంది
ఓటీఎస్.. పేరు వింటేనే అధికారుల్లో వణుకు పుడుతోంది. ఐఏఎస్ అధికారి నుంచి సచివాలయ సిబ్బంది, వలంటీర్ వరకు వారి వారి స్థాయిలో లక్ష్యాలను పూర్తి చేసేందుకు తంటాలు పడుతున్నారు. ఓటీఎస్ వసూలుకు సంబంధించిన శాఖ హౌసింగ్ అయినప్పటికీ మండలస్థాయిలో అన్ని శాఖల అధికారులనూ భాగస్వాములను చేసి వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టారు. దీనికితోడు నిత్యం టెలి, వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగులు, సమీక్షలు, తనిఖీలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి రోజు ఉదయం అరగంట సేపు కలెక్టర్ హరినారాయణన్ ఈ అంశంపై టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, హౌసింగ్ అధికారులు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, జేసీలు.. ఇలా అందరూ ఇందులో పాల్గొంటారు. మళ్లీ రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున సాయంత్రం జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6గంటల వరకు వీడియో కాన్ఫరెన్సు ఉంటుంది. ప్రతి మంగళవారం నేరుగా సమీక్షిస్తున్నారు. దీంతో అన్ని స్థాయిల్లోనూ సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు.

Share this on your social network: