కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు అందుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై సజ్జల చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనలకు, ఉద్యోగ సంఘం నేతల మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించడం లేదన్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించేదేమోనని సజ్జల పేర్కొన్నారు. కొత్త పే స్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న డీడీఓలను పనిచేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు
హెచ్ఆర్ఏ శ్లాబ్‌లపై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమన్నారు. పదే పదే చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడామన్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఒకటి లేదా రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పామని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్మెంట్‌పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయన్నారు. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించడం సరికాదని సజ్జల పేర్కొన్నారు.

Share this on your social network: