ఏపీలో పలు థియేటర్స్ వద్ద ఆందోళన చేపట్టిన పవన్ అభిమానులు

Published: Friday February 25, 2022

 ‘భీమ్లానాయక్’ మూవీ థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు.  భారీగా థియేటర్ల వద్దకు అభిమానులు చేరుకున్నారు.  పలు థియేటర్ల వద్ద డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టిక్కెట్లు అమ్మాలంటూ అధికారుల ఆదేశాలివ్వడంతో.. ఆయా థియేటర్స్ వద్ద పోలీసుల్ని మోహరింపచేశారు. ఇక అనంతపురం  తాడిపత్రిలో భీమ్లానాయక్ సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మీ నారాయణ థియేటర్ లో కుర్చీల్ని ధ్వంసం చేశారు. సినిమాను సరిగా ప్రదర్శించక పోవడం... సౌండ్ సరిగా రాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ కుర్చీలు ధ్వంసం చేసి డోర్లు బద్దలుకొట్టారు. దాంతో పోలీసులు  థియేటర్ వద్దకు చేరుకున్నారు.  

 గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం లో ‘భీమ్లా నాయక్’ సినిమా కు అడ్డంకులు ఏర్పడ్డాయి. కొల్లూరు లో భీమ్లా నాయక్ సినిమా వేస్తున్న సినిమా ధియేటర్ కి బీఫామ్ లేదని అధికారులు షోలు మొత్తం రద్దు చేసిశారు.  సినిమా రద్దు చేయటంతో బస్టాండ్ సెంటర్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు పవన్ కళ్యాణ్ అభిమానులు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మార్వో కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా వెయ్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు ఆందోళన చెయ్యటంతో వేమూరు భట్టిప్రోలు వెళ్లే మార్గంలో  ట్రాఫిక్ జామ్ అయింది.

విశాఖపట్నం పెందుర్తి సినిమా థియేటర్స్ వద్ద  భీమ్లా నాయక్ సినిమా సందడి నెలకొంది. థియేటర్ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికుల కోలాహలంతో నిండిపోయింది. పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.  పూల వర్షం కురిపించారు. భీమ్లా నాయక్ సినిమా పై జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని అభిమానులు తప్పుపట్టారు. కృష్ణా  జిల్లా  మైలవరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు  ఆందోళన చేపట్టారు. మైలవరం నారాయణ థియేటర్ లో భీమ్లా నాయక్ మూవీ చూడటానికి అభిమానులు తరలివచ్చారు.అయితే  టికెట్స్ ను తక్కువ ధరలకు ఇవ్వలేక మూవీ ప్రదర్శనను వచ్చే నెల 13 వరకు నిలుపుదల చేస్తున్నట్లు యాజమాన్యం బోర్డ్ పెట్టారు. దీంతో థియేటర్  ముందు  పవన్ అభిమానులు నిరసనకు దిగి  సి ఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆపై పవన్ చిత్ర పటానికి అభిమానులు హారతులిచ్చారు.