గేయ రచయిత కందికొండ కన్నుమూత!

Published: Saturday March 12, 2022

ప్రముఖ సినీ గేయ రచయిత  కందికొండ  యాదగిరి(49) కన్నుమూశారు. కొన్నేళ్లగా నోటి కాన్సర్‌తో పోరాటం చేస్తూ చికిత్స పొందుతున్న ఆయన వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆస్సత్రి ఖర్చులు చెల్లించలేక కుటుంబ సభ్యులు ఇబ్బందిపడుతున్నారు. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆయన చికిత్స కోసం ఆర్థికంగా సహకరించింది. కొన్ని సందర్భాల్లో తోటి గీత రచయితలు కూడా ఆయనకు అండగా నిలిచారు. 

వరంగల్‌ జిల్లా నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్‌ చదివారు. తెలుగు సాహిత్యంపై ఉన్న పట్టుతో  సినీ రంగంవైపు అడుగులు వేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు.  మెలోడీ పాటలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే, ‘పోకిరి’లో ‘గలగల పారుతున్న గోదారిలా’, ‘జగడమే’, పాటలు రచించారు. 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. అలాగే తెలంగాణ గీత రచయితల మీద సాంస్కృతిక శాఖ తెలుగు మహాసభలు సమయంలో విడుదల చేసిన పుస్తకానికి ఆయనే రచన చేశారు. 

కందికొండ మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భాంతికి లోనైంది. తోటి గేయ రచయితలు, సంగీత దర్శకులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. 

కందికొండ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలో నిజం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యం కారణంగానే ఆయన మరణించారని తెలిపారు.