పనిగట్టుకుని వివాదం...చినజీయర్

Published: Friday March 18, 2022

ఇటీవల చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. పనిగట్టుకుని వివాదం చేసి టీవీల్లో వాళ్ల వాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్ హడావుడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. 20 ఏళ్ల కింద అన్నమాట గురించి వివాదం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, గ్రామదేవతల్ని కించపరిచినట్టుగా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తాము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్‌ కూడా వస్తుంటారని తెలిపారు. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమని ప్రకటించారు. మహిళలను చిన్నచూపు చూసేవారిని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్పప్రచారం చేస్తున్నారని జీయర్‌స్వామి ఆక్షేపించారు.