కొత్త మంత్రుల ఫైనల్ లిస్ట్

Published: Friday April 08, 2022

కులాలవారిగా సీఎం జగన్ కేబినెట్ కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. కేబినెట్‌లో బీసీ సామాజిక వర్గానికి 9, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2, రెడ్డి సామాజికవర్గానికి 3, కాపులకు 3,  కమ్మ, ముస్లిం సామాజిక వర్గాల నుంచి ఒకరిని తన కేబినెట్‌లోకి జగన్ తీసుకుంటారని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో కాపు, రెడ్డి సామాజివర్గాల నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు. కొత్త కేబినెట్‌లో ఈ సామాజికవర్గం నుంచి ఒక్కొక్కరికి ఉద్వాసన పలుకనున్నారు. ఆ రెండు స్థానాలను బీసీ, ఎస్సీ సామాజివర్గాలకు కేటాయిస్తారని చెబుతున్నారు. ముస్లిం కోటా నుంచి ముస్తఫా, హఫీజ్ ఖాన్‌కు చోటు కల్పిస్తారని చెబుతున్నారు. కొత్త కేబినెట్‌లోని శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, చిలకలూరిపేట నుంచి రజనీ, సర్వేపల్లి నుంచి కాకాని గోవర్దన్‌రెడ్డిలకు బెర్త్‌లు ఖాయమయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడేళ్లుగా మంత్రి పదవుల్లో ఉన్నవారంతా మాజీలు అయ్యారు. పాత మంత్రులు పోగానే... కొత్త మంత్రివర్గం కూర్పుపై ‘సామాజిక సమీకరణ’ వార్తలు గుప్పుమన్నాయి. కొత్త కేబినెట్‌లో జగన్‌ తన సొంత సామాజిక వర్గానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారని... బీసీ, ఎస్సీలకు పెద్దపీట వేస్తారని వైసీపీ అనుకూల వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. జగన్‌ పాలనపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో... కేబినెట్‌లో కుల సమీకరణనే నమ్ముకున్నారని, కొందరికి పదవులు ఇచ్చి ఆ వర్గాలన్నింటినీ ఉద్ధరిస్తున్నట్లుగా చెప్పుకోవడమే దీని వెనుక వ్యూహమని పేర్కొంటున్నారు. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో... అధికారిక అజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన తర్వాత... మొత్తం 24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజీనామా చేయించారు. వారికి వివరణ ఇచ్చేలా ప్రసంగించారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని కూడా తొలగిస్తున్నందుకు బాధ పడుతున్నానని తెలిపారు.