పెళ్లి ఇష్టం లేక యువతి ఘాతుకం

Published: Tuesday April 19, 2022

ఓ యువతి తనకు కాబోయే భర్తకు ఫోన్‌ చేసి ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ బైక్‌పై షికారుకు వెళ్లారు. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. చున్నీని అతడి మెడకు చుట్టి కత్తితో గొంతు కోసింది. ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఏకంగా చంపేసేందుకు ప్రయత్నించింది. సోమవారం అనకాపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామానికి చెందిన అద్దెపల్లి రామునాయుడుకు, రావికమతానికి చెందిన వి.పుష్పకు ఈ నెల 4న వివాహ నిశ్చితార్థం జరిగింది. మే నెలలో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తాన్ని నిశ్చయించారు. సోమవారం రామునాయుడుకు పుష్ప ఫోన్‌ చేసి, ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ కలిసి బైక్‌పై బుచ్చెయ్యపేట మండలం అమరిపురి బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. కాసేపు  మాట్లాడుకున్నాక తిరుగు ప్రయాణమయ్యారు.

 

మార్గమధ్యంలో బైక్‌  ఆపాల్సిందిగా పుష్ప కోరింది. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. రామునాయుడు కళ్లు మూసుకోగా... చున్నీని అతడి మెడకు చుట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. రామునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, ప్రమాదం జరిగిందని, అతను గాయపడ్డాడని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. రామునాయుడు ఆమె చేయి పట్టుకుని ఆపి బైక్‌ ఎక్కించాడు. మెడకు కర్చీఫ్‌ చుట్టుకుని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పాడు. అనంతరం బైక్‌లో రావికమతం పీహెచ్‌సీకి వెళ్లాడు. రామునాయుడు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కేజీహెచ్‌కి తరలించాలని వైద్యులు సూచించారు. అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి, చికిత్స చేయిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. రామునాయుడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు