అసదుద్దీన్ సహా పలువురు నేతల ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు... స్పందించిన పీయూష్ గోయల్

Published: Wednesday November 01, 2023
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురు నేతలు తమ ఐఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఆరోపించారు. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి హ్యాకింగ్ అలర్ట్ సందేశాలు రావడం సంచలనంగా మారింది. కేంద్రంపై విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. వారి ఆరోపణలను పీయూష్ గోయల్ ఖండించారు. విపక్ష నేతలను ఎవరో ప్రాంక్ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను... దానిపై వారు ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, 'ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్‌కు హ్యాకింగ్‌ ముప్పు ఉంది. మీ యాపిల్ ఐడీ ద్వారానే మీ ఫోన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉన్నదని యాపిల్ భావిస్తోంది. మీ ఫోన్లు హ్యాక్ అయితే సున్నితమైన డేటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉంది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్ తీసుకొంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావొచ్చు. అయినప్పనటికీ దీన్ని సీరియస్‌గా తీసుకోండి' అని అలర్ట్ వచ్చింది.