అధికారుల పనితీరుపై నిరాశ....

Published: Thursday September 06, 2018
నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. విశాఖపట్నానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పారిశుధ్యం మెరుగుపరిచాం. పచ్చదనం పెంచుతున్నాం. అయినా అంటువ్యాధులు ప్రబలడం దురదృష్టకరం. ఇన్ని చేసినా డెంగీ ఉందంటే బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల సమర్థతనే శంకించాల్సి వస్తోంది. వారి పని తీరుతో తీవ్ర నిరాశ చెందాను’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డెంగీ నియంత్రణపై బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండురోజుల్లో అంటువ్యాధులను పూర్తిగా అదుపు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పరిస్థితుల్లో మార్పు రావాలని, లేదంటే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తానని చెప్పారు.
 
‘జిల్లాల్లో వ్యాధులు ప్రబలడం చూస్తే చాలా బాధగా ఉంది. అసమర్థంగా వ్యవహరిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. విశాఖలో 33, గుంటూరులో 20 ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పారు. విశాఖ, అనంతపురం, గుంటూ రు, విజయనగరం జి ల్లాలపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. ‘అధికారుల అసమర్థత వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదు.. మాకేమిటిలే అనే నిర్లక్ష్యాన్ని సహించేది లేదు’ అని హెచ్చరించారు. పట్టణాల్లో మెప్మా కార్యకర్తలు చురుగ్గా స్పందించాలని, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పంచాయితీరాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి హాట్‌ స్పాట్‌ బాధ్యతను à°’à°• సీనియర్‌ అధికారికి అప్పగించి, అవసరాన్ని బట్టి సిబ్బందిని పెంచుకోవాలని చెప్పారు. దోమల బెడదను పూర్తిగా నివారించాలని ఆదేశించారు.
 
రక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని, అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యాంటి లార్వా ఆపరేషన్లు చేపట్టి, యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు నిల్వ ప్రదేశాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేసి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. మురుగు నిల్వ ఉండే ప్రాంతాల్లో వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో ఎక్కడైనా పారిశుధ్యం అధ్వానంగా ఉంటే ఫోటోలు తీసి పంపించాలని సీఎం సూచించారు.