అరకు సీఐపై వేటు?...కొందరు అధికారులకు స్థాన చలనం
Published: Saturday September 29, 2018

లివిటిపుట్టు ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరిపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మన్‌రావును సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా అరకు సీఐ ఇ.వెంకునాయుడు సస్పెన్షన్‌కు రంగం సిద్ధం చేశారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ గత ఆదివారం మధ్యాహ్నం లివిటిపుట్టు వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యల నేపథ్యంలో కొందరు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి, సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మన్‌రావు సస్పెండ్ చేశారు.
శనివారం సీఐ వెంకునాయుడుకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. కొంతకాలంగా స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నా సమాచారం రాబట్టలేకపోవడాన్ని వైఫల్యంగా పోలీసు ఉన్నతాధికారులు పరిగణించినట్టు తెలిసింది. ఇదే విషయంలో రానున్న రోజుల్లో మరికొందరు అధికారులను కూడా బదిలీ చేయనున్నట్టు చెబుతున్నారు. వచ్చే నెల మొదటి, రెండవ వారాల్లో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడవచ్చునని భావిస్తున్నారు.

Share this on your social network: