ప్రతి ఎకరాకూ సాగునీరు.. అగ్రిటెక్‌ సదస్సులో సీఎం చంద్రబాబు

Published: Friday November 17, 2017
 ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, వారి అభిరుచులకు తగ్గట్టు పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో అగ్రిటెక్‌ సదస్సు-2017లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులకు నీటి భద్రత కల్పిస్తామని ప్రకటించారు. పంటలు ఎండిపోకుండా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని సాగుకు అందిస్తున్నామన్నారు. పోలవరాన్ని కూడా త్వరగా పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఏ ప్రాంతంలో ఏ కాలంలో ఏ రకమైన పంటలు వేయాలో సూచిస్తామని తెలిపారు. సమయానికి విద్యుత్తుతో పాటు నీరు కూడా రైతులకు ఇస్తామని, తక్కువ ధరలకు ఎరువులు, మందులు సరఫరా చేస్తామన్నారు.
 
మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించేందుకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. 40 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏపీలో సంతోషకరమైన వాతావరణం ఉందని, ఇక్కడ సగటు జీవన ప్రమాణ కాలం ఐదేళ్లు ఎక్కువని సీఎం పేర్కొన్నారు. అగ్రి టెక్‌ సదస్సులో భాగంగా ఆదర్శ రైతులతోనూ ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల కన్నా వ్యవసాయానికే అధిక ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు.
 
వ్యవసాయంతోపాటు ఉద్యానవన పంటలు, కోళ్లు, చేపలు, పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే రైతులు ఆర్థికంగా స్థిరపడతారన్నారు. వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, వ్యవసాయరంగ నిపుణులు మాట్లాడారు. పురుగుమందుల పిచికారీకి డ్రోన్‌లను వినియోగించడం వల్ల రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని మహారాష్ట్రకు చెందిన రాజ్‌కుమార్‌ అనే ఇంజనీరు ఆందోళన వ్యక్తం చేయగా సీఎం స్పందిస్తూ డ్రోన్ల వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తూ చట్టం తీసుకొస్తామన్నారు. అనంతరం ఆదర్శ రైతులను ముఖ్యమంత్రి సత్కరించారు.