పార్టీలో సరికొత్త సంప్రదాయం

Published: Friday November 23, 2018
 జిల్లాలో వైసీపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. జనసేన కొత్త ముఖాలను పోటీకి నిలపాలని దృష్టిసారిస్తోంది. ఈ తరుణంలో టీడీపీలో మాత్రం మరొక విధమైన పోకడ కనిపిస్తోంది. అరవై, డబ్బయ్‌ ఏళ్ల వయసుదాటిన వాళ్లూ తాము పోటీకి సై అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ‘‘చంద్రబాబు 9 ఏళ్లపాటు సీఎంగా ఉన్నప్పుడు పార్టీలో చాలా క్రమశిక్షణ ఉండేది. ఇష్టం వచ్చినట్టు స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కొంత పరిస్థితి మారింది. ఇష్టం వచ్చినట్టు నేనే మళ్లీ పోటీచేస్తానని ఒకరు, టికెట్‌ నాదేనంటూ ఇంకొకరు.. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వారు స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు.
 
ఇది మంచి పరిణామం కాదు.. ఎవరికి టికెట్‌ ఇవ్వాలనేది అధిష్ఠానం చూసుకుంటుంది. ఈ పరిణామాలు పార్టీ కేడర్‌లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. కట్టడి చేయడంపై అధిష్ఠానం దృష్టిపెట్టాలి..’’ అని టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. అమరావతి ఓ వైపు, పోలవరం ఇంకోవైపు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు.. చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయ్‌. దీంతో పార్టీపై పూర్తి స్థాయి దృష్టిసారించలేకపోతున్నారు. ఇదే అదునుగా కొందరు నాయకులు సొంత పెత్తనం చేయాలని చూస్తున్నారని ఇంకో నేత చెప్పడం విశేషం.
 
‘‘మళ్లీ రాజమహేంద్రవరం ఎంపీగా టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ నేను మళ్లీ పోటీచేసి గెలుస్తా.. టికెట్‌ నాదే’’ అంటూ కొన్ని నెలల కిందట రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ స్వయంగా ప్రకటించుకున్నారు. అప్పటివరకు ఎంపీగా ఆయన కోడలు రూపాదేవిని టీడీపీ నిలబెడుతుందన్న ప్రచారం సాగింది. మురళీమోహన్‌కి ఎన్నికల నాటికి ఎనభై ఏళ్లు వస్తాయని, పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని కొన్నాళ్ల కిందట టీడీపీ పెద్దలలోనేచర్చ నడిచింది.
 
పెద్దాపురం నుంచి 2019లో మళ్లీ నేనే పోటీచేస్తాను. ఎవరెవరో ఏవేవో చెప్తున్నారు. ఖచ్చితంగా టికెట్‌ నాదే. పోటీచేసి గెలవడం ఖాయం... అంటూ డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప పలు ఇంటర్వ్యూల్లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పలు బహిరంగ సభలలోనూ పెద్దాపురం నుంచే పోటీ అని పదేపదే ప్రకటించుకుంటున్నారు. రాజప్ప బాటలోనే ఆయన రాజకీయ శిష్యుడు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, సీనియర్‌ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు కూడా తామే పోటీ చేస్తున్నట్టు ప్రకటించేసుకున్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు.. 2019 ఎన్నికలలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, మంత్రి కూడా అవుతానంటూ చేసిన ప్రకటనలు కోనసీమ టీడీపీలో కలకలం రేపాయి.