రివ్యూ: ఉన్నది ఒకటే జిందగీ

Published: Friday November 03, 2017

చిత్రం: ఉన్నది ఒకటే జిందగీ 
నటీనటులు: రామ్‌.. అనుపమ పరమేశ్వరన్‌.. లావణ్య త్రిపాఠి.. శ్రీవిష్ణు.. కిరీటి.. ప్రియదర్శి.. అనీషా ఆంబ్రోస్‌.. కౌశిక్‌ తదితరులు 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌ 
కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌ 
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి 
నిర్మాత: కృష్ణ చైతన్య 
సమర్పణ: స్రవంతి రవికిషోర్‌ 
రచన, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల 
సంస్థలు: పీఆర్‌ సినిమాస్‌, స్రవంతి సినిమాటిక్స్‌ 
విడుదల తేదీ:27-10-2017

నటనలో రామ్‌ శైలిని మార్చడమే కాదు.. ఆయనకి ఓ మంచి విజయాన్ని అందించిన చిత్రం ‘నేను శైలజ’. దర్శకుడిగా కిషోర్‌ తిరుమలకీ మంచి పేరును తీసుకొచ్చింది. విజయవంతమైన ఆ కలయికలో తెరకెక్కిన మరో చిత్రమే ‘ఉన్నది ఒకటే జిందగీ’. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దానికి తోడు హిట్‌ కాంబినేషన్‌ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందా? రామ్‌కి మరో విజయం ఖాయమేనా?

కథేంటంటే?: అభిరామ్‌(రామ్‌), వాసు(శ్రీవిష్ణు), సతీష్‌(ప్రియదర్శి), సాయి(కిరీటి) నలుగురు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అభికి మంచి స్కూల్‌లో చదివే అవకాశం వచ్చినా, వాసు కోసం వెళ్లకుండా అతనితోనే ఉంటాడు. ఎవరికి నచ్చినట్టు వారు నడుచుకోవాలనుకునే వ్యక్తి అభి. అంతేకాదు సంగీతం అంటే కూడా ప్రాణం. సొంతంగా ఓ రాక్‌ బ్యాండ్‌ గ్రూప్‌ను నడుపుతుంటాడు. అనుకోకుండా ఓ చిన్న ప్రమాదం కారణంగా మహా(అనుపమ పరమేశ్వరన్‌) అభి జీవితంలోకి ప్రవేశిస్తుంది. పరిచయాల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇంతలోనే మహాకి వాసుతో పెళ్లి నిశ్చయమవుతుంది. మహా కూడా వాసుని చేసుకోవడానికి ఇష్టపడుతుంది. మరి ఆ ఇద్దరి పెళ్లి జరిగిందా? అభి-మహాల మధ్య ప్రేమ ఏమైంది? ఆ తర్వాత కొన్నేళ్లకు మేఘన(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి వాసు, అభిల జీవితంలోకి ఎలా ప్రవేశించింది? అప్పుడు ఆ నలుగురి స్నేహితుల జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? తదితర విషయాలను తెరపై చూడాలి.

ఎలా ఉందంటే?: ప్రేమ, స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫ్రెండ్‌షిప్‌ ఇతివృత్తంగా ఇటీవల వచ్చిన సినిమాలు చాలా తక్కువ. దీంతో ఈ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, అభి-మహాల ప్రేమకథ మొదలవడంతో సినిమా గాడిన పడుతుంది. ఆ ఇద్దరి ప్రేమ కథలోకి వాసు రావడంతో కథ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారుతుంది. ఆ వెంటనే అభి-వాసుల మధ్య మనస్పర్థలు రావడం.. అభి ఇటలీకి వెళ్లిపోవడంతో ద్వితీయార్ధం కీలకంగా మారుతుంది. విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుస్తారా? లేదా? అనే ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవుతుంది. మహా గురించి తెలిశాక, అభి మళ్లీ ఇండియాకు రావడం.. ఆ తర్వాత వాసుకి, అభికి మేఘనతోనే పరిచయం, సాన్నిహిత్యం పెరగడంతో కథ మరిన్ని మలుపులు తీసుకుంటుంది. ద్వితీయార్ధంలో సంభాషణలు, స్నేహం నేపథ్యంలో సన్నివేశాలు చక్కగా తెరకెక్కించారు. పతాక సన్నివేశాల్లో అభి-మహాల మధ్య ప్రేమ గురించి వాసు చెప్పే సంగతులు ప్రేక్షకుడిలో ఓ ఫీల్‌ను తీసుకొస్తాయి. ప్రేమ-స్నేహం నేపథ్యంలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. ప్రియదర్శి, కిరీటి, హిమజ తదితరుల మధ్య సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి.

ఎవరెలా చేశారంటే?: రామ్‌ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. తన గెటప్‌ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేమ-స్నేహం గురించి వచ్చే సన్నివేశాల్లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలు కీలకం. ఆ సన్నివేశాల్లో రామ్‌ నటన కట్టిపడేస్తుంది. మరో ప్రాణ స్నేహితుడిగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. పతాక సన్నివేశాల్లో అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠిలు వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ప్ర‌థమార్ధంలో అనుమప నటన, అందం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ద్వితీయార్ధంలో లావణ్య, హిమజ కలిసి నవ్వులు పండిస్తారు. అభి-వాసుల స్నేహితులుగా కౌశిక్‌, ప్రియదర్శి, కిరీటి చేసే సందడి, వాళ్ల నటన ఆకట్టుకుంటుంది.

సాంకేతికంగా అన్ని విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా దర్శకుడు కిషోర్‌ తిరుమలలోని రచనా నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. కథనం కూడా పకడ్బందీగా ఉంటుంది. స్నేహం గురించి ఆయన రాసిన సంభాషణలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. స్రవంతి సంస్థ నిర్మాణ విలువలు స్థాయికి తగ్గటుగా ఉన్నాయి.

బలాలు 
+ రామ్‌, అనుపమల నటన 
+ ద్వితీయార్ధం 
+ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం

బలహీనతలు 
- ప్రథమార్ధంలో సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరిగా: స్నేహం+ప్రేమ= జిందగీ 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.