నెలాఖరులోగా నిధులు.. వెంటనే రైతు ఖాతాల్లో

Published: Wednesday January 09, 2019
రెవెన్యూ లోటు ఉన్నా.. ఆడినమాట తప్పకూడదన్న ఉద్దేశంతో రైతు రుణ మాఫీని పూర్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.లక్షన్నర మాఫీ చేస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. ఆ ప్రకారం లక్షన్నరలో మొదట రూ.50 వేలు ఏకమొత్తంగా మాఫీ చేసింది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా మిగతా మొత్తాన్ని 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. 58.29 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 3 విడతల్లో 10% వడ్డీతో కలిపి రూ.15,147 కోట్లను జమచేసింది. చివరి విడతల సొమ్మును ఒకేసారి ఇచ్చేస్తామని సీఎం ప్రకటించారు.
 
ఇందు కు రూ.8,100 కోట్లు అవసరం. దాదాపు 36 లక్షల మంది రైతులకు మాఫీ అమలు చేయాలి. అప్పుతెచ్చి రుణ మాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈనెల 21 నుంచి 25 వరకు ఆర్థిక శాఖ అధికారులు పలు బ్యాంకులతో చర్చించనున్నారు. ఆర్థిక శాఖ గ్యారెంటీగా ఉండి బ్యాంకుల నుంచి కొంత మొత్తాన్ని రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకులు రుణమి చ్చాక ఆ నిధులను రైతు సాధికార సంస్థ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రుణ మాఫీ కోసం గతేడాది రైతుసాధికార సంస్థ ప్రభుత్వ గ్యారెంటీతో ఒక జాతీయ బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్లు అప్పు తీసుకుంది.
 
ఈసారి ప్రభుత్వ గ్యారెంటీతో ఆర్థిక శాఖే రుణం తీసుకోవాలని భావిస్తోంది. బ్యాంకులతో సంప్రదిం పులు పూర్తయ్యాక.. జనవరి చివరి వారంలో బ్యాంకులు నిధులు విడుదల చేస్తే తర్వాత రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేయనున్నారు. రుణమాఫీ ప్రక్రియను ఫిబ్రవరి 20లోగా పూర్తిచేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా గత డిసెంబరులోపే ఈ ప్రక్రియను ముగించాలని భావించినా, ఆర్థిక సమస్యల కారణంగా కొంత జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు.