‘మోదీ ప్రభుత్వ పతనం మొదలైంది

Published: Sunday January 20, 2019
‘‘మోదీ ప్రభుత్వ పతనం మొదలైంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయం!’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మోదీ కేవలం ప్రచారాల ప్రధాని అని విమర్శించారు. à°ˆ దేశానికి పనిచేసే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమయ్యాయన్నారు. శనివారం కోల్‌కతాలో ‘యునైట్‌ ఇండియా బ్రిగేడ్‌’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బెంగాలీలో తొలి పలుకులు పలికారు. బెంగాలీ ప్రముఖులైన వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి మహనీయులను గుర్తుచేసుకున్నారు. తర్వాత ఇంగ్లీషులో తన ప్రసంగం కొనసాగించారు. ‘‘ఇది చరిత్రాత్మక రోజు. దేశ చరిత్రను మలుపు తిప్పే భారీ సభ నిర్వహిస్తున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అభినందనలు. à°ˆ వేదికపై జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అనేకమంది మహామహులైన నేతలు ఉన్నారు. à°ˆ సభ లక్ష్యం ఒక్కటే. సేవ్‌ ఇండియా, సేవ్‌ డెమోక్రసీ! దేశాన్ని ఒక్కటిగా ఉంచడం మన అందరి లక్ష్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని విభజించి పాలిస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం అమలు చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ సర్కారు తీవ్రంగా వేధిస్తోందని ఆక్రోశించారు. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందన్నారు. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని... తమ హక్కులు లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాల్లో సంక్షోభాలు సృష్టిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘కశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం సృష్టించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడ ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొనేందుకు డబ్బులు వెదజల్లుతున్నారు. కర్ణాటక సర్కారును కూల్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై కలిసికట్టుగా పోరాటం మొదలుపెట్టామని చంద్రబాబు తెలిపారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ, ఐటీ తదితర విభాగాలను స్వార్థానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను కేంద్రం వేధిస్తోందన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా, మళ్లీ బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సి ఉందని పిలుపునిచ్చారు.