మధ్యాహ్న భోజనంపై విమర్శలు

Published: Wednesday January 23, 2019
నాసిరకం, లావు బియ్యంతో అన్నం! చిన్న సైజు, ఉడికీ ఉడకని గుడ్లు! తక్కువ పరిమాణంలో చల్లబడిన ఆహారం! ఇవీ కొత్త ఏజెన్సీలు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై పలు జిల్లాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇలాంటి తిండి తినే పాఠశాల విద్యార్థులకు ఏం పౌష్టిక బలం అందుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఈ కొత్త ఏజెన్సీలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాకం వల్ల ఈ మూడు జిల్లాల్లో చిన్నారులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని, చాలా మంది ఈ భోజనం తినలేక మధ్యాహ్న ఇంటికి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారిలో రక్తహీనత కలగకుండా చూడాలని, డ్రాపవుట్లు తగ్గించాలన్న సదుద్దేశంతో ఏర్పాటైంది మధ్యాహ్న భోజన పథకం. అధికారుల నిర్లిప్తత ఫలితంగా కొన్ని జిల్లాల్లో ఏజెన్సీల ఇష్టారాజ్యం అన్నట్టు భోజన సరఫరా మారడంతో ఈ పథకం ఆచరణలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వరంగ యాజమాన్యాల్లోని 45,539 పాఠశాలల్లో కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.
 
కానీ, దాదాపు 70 శాతం పాఠశాలల్లో ఇప్పటికీ కిచెన్‌ షెడ్లు లేవు. అలాంటి పాఠశాలల పరిధిలో క్లస్టర్‌ విధానంలో ప్రైవేటు ఏజెన్సీలకు వడ్డన బాధ్యతలను అప్పగించారు. à°—à°¤ వంట ఏజెన్సీల కాంట్రాక్టు కాలపరిమితి ముగియడంతో తాజాగా అక్షయపాత్ర (కర్ణాటక), నవ ప్రయాస (ఢిల్లీ), ఏక్తాశక్తి (ఢిల్లీ) అనే మూడు ఏజెన్సీలతో పాటు అల్లూరి సీతారామరాజు ట్రస్ట్‌ వంటి సంస్థలకు కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 71 క్లస్టర్‌à°² ద్వారా సమీపంలోని పాఠశాలలకు భోజనం అందజేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌ నుంచి 20-25 వేల మందికి చొప్పున దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులకు భోజనం అందాలి. అయితే, క్లస్టర్‌ కిచెన్ల నుంచి పాఠశాలలు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, వేలమంది కోసం వంట తయారీని అర్ధరాత్రి రెండు à°—à°‚à°Ÿà°² నుంచే మొదలుపెడుతున్నారు. అవి మరునాడు మధ్యాహ్నం వడ్డించే సమయానికి చల్లారిపోతున్నాయి. బడి పిల్లలకు సన్నబియ్యంతో అన్నం వండి వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి భిన్నంగా కొన్ని ఏజెన్సీలు నాసిరకం బియ్యం వండిస్తున్నాయి.