ఇంత సంక్షేమం ఎక్కడైనా ఉందా?

Published: Friday February 08, 2019
ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వు చూడడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత సంక్షేమం చేసిన రాష్ట్రం దేశంలో లేనే లేదన్నారు. ఎక్కడైనా ఉంటే చెప్పాలని సవాల్‌ విసిరారు. మైనారిటీలకు కూడా సబ్‌ప్లాన్‌ తీసుకొస్తామని ప్రకటించారు. సంక్షేమం, మానవ వనరుల అభివృద్ది అన్న అంశంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
 
‘బిడ్డ గర్భంలో పడినప్పటినుంచి పుట్టుక, బాల్యం, చదువు, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పెళ్లి కానుక, పింఛను, చంద్రన్నబీమా వరకు సాయం చేశాం. ఒకవేళ చనిపోతే గౌరవంగా అంతిమయాత్ర చేసేందుకు మహాప్రస్థానం పెట్టాం. సవాల్‌ చేస్తున్నా.. ఇంత సంక్షేమం చేసిన రాష్ట్రం దేశంలోనే లేదు. చివరకు సంపన్న రాష్ట్రాలు కూడా ఇంత సంక్షేమం చేయలేదు. ఎక్కడైనా ఉంటే చెప్పండి. వారు చెప్పేదీ వింటా’ అని తెలిపారు. తమది మానవత్వం ఉన్న ప్రభుత్వమని, కేంద్రానికి మానవత్వం లేదని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..
 
‘à°’à°• ఆర్థికశాస్త్ర విద్యార్థిగా చెబుతున్నా.. సంపద సృష్టించాలి. దాన్ని సంక్షేమానికి పంచాలి. అన్ని కులాలు, వర్గాల సమ అభివృద్ధే మా లక్ష్యం. అన్నివర్గాల సమ్మిళిత వృద్ధే మా సిద్ధాంతం. నాది పేదల కులం. పేదోడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చాలామంది అంటున్నారు.. ఇంత సంక్షేమానికి డబ్బు ఎలా తెచ్చారని? మరికొందరు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని అడుగుతున్నారు. ఇంత ఽసంక్షేమం చేసే ధైర్యం, సత్తా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే. ఐదేళ్లలో సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం దేశంలోనే మరొకటి లేదు. ఇంతకుమించిన సంక్షేమాన్ని 2019-24లో చేస్తాం. ఏం చేస్తామన్నది త్వరలోనే చెబుతాం.’
 
‘మేం చేసే ప్రతి పని మనసుతో చేస్తాం. మానవత్వంతో ఆలోచిస్తాం. సిద్ధాంతంతో చేస్తాం. ఉదాహరణకు అన్న క్యాంటీన్లు పెట్టాం. దీనికో సిద్ధాంతం ఉంది. కూలీకి, చిరు ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి మధ్యాహ్న భోజనం బయట ఎక్కడో హోటల్లో చేయాలంటే చాలా ఖర్చు. లేకుంటే భార్య పొద్దుటే లేచి వంటచేయాలి. చేసినా మధ్యాహ్నానికి చల్లారిపోతుంది. అందుకే సమయానికి, ఖర్చు తగ్గించేలా, వేడిగా, నాణ్యతతో, రుచిగా భోజనం పెట్టాలని అన్న క్యాంటీన్‌ పెట్టాం. టిఫిన్‌, భోజనం ఏదైనా రూ.5కే అందిస్తున్నాం. ప్రతి దశలోనూ ప్రజలకు సాయపడే పథకాలు అమలుచేస్తున్నాం. వీటన్నిటినీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను ఎక్కడికైనా వెళ్తే డ్వాక్రా మహిళలు దీని గురించి మీకంటే బాగా చెబుతున్నారు. నాకంటే బాగా మాట్లాడుతున్నారు. ప్రతి పథకం గురించీ చెబుతున్నారు.’