వరాలా.. విమర్శలా?.. రైల్వే జోన్‌తోనే సరా?

Published: Friday March 01, 2019
ప్రధాని మోదీ శుక్రవారం విశాఖపట్నం రానున్నారు. ఆయన పర్యటనకు బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లుచేశారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని.. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌తోనే సరిపెడతారా.. కొత్త/పాత వరాలు గుప్పిస్తారా.. లేక గుంటూరు సభలో మాదిరిగా సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడానికే పరిమితమవుతారా అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చని ప్రధానికి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదంటూ టీడీపీ నేతలు జిల్లావ్యాప్తంగా ‘మోదీ గో బ్యాక్‌’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
 
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు ఆమరణ నిరాహారదీక్ష కూడా ప్రారంభించారు. దారిపొడవునా ప్రధానికి నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామని సమితి ఇప్పటికే ప్రకటించింది. మోదీ తన ప్రసంగంలో రైల్వేజోన్‌నే ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం కలిగేలా à°•à°¡à°ª స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, జాతీయ విద్యా సంస్థలకు నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిపై ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ప్రజలు ఆశిస్తున్నా.. అలాంటిదేమీ ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వరాలు, హామీలను పక్కనపెట్టి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శల దాడిని కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నాయి. కాగా, మోదీ సభకు నగరంలోని ఆర్పీఎఫ్‌ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లుచేశారు. రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు విమానాశ్రయం నుంచి సభాస్థలి వరకూ అన్ని మార్గాలను బీజేపీ తోరణాలు, ఫ్లెక్లీలతో కాషాయమయంగా మార్చేశారు.