ఆంధ్రాలో 139 ఉష్ణ మండలాలు

Published: Wednesday May 01, 2019
ఎండలు... నిశ్శబ్ద విపత్తు!. తుఫాన్లలా ఒక్కసారిగా విరుచుకుపడవు. భారీ వర్షాల్లా ముంచెత్తవు. భూకంపం తరహాలో జనజీవనాన్ని కకావికలం చేయవు. కానీ ఎలాంటి హడావుడి లేకున్నా హడలెత్తిస్తుంది. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడకపోయినా అతి ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావాన్నే చూపుతాయి. గత ఐదేళ్లలో ఏకంగా 2,784 మందిని అధిక ఉష్ణ వాతావరణం బలి తీసుకొంది. వేల మంది వడదెబ్బకు గురయ్యారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, తగ్గుతున్న చెట్లు, ఇతర కారణాలతో ప్రతి ఏడాదీ ఎండలు పెరిగిపోతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉష్ణోగత్రలే నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2015, 2016 తరహాలో తీవ్ర ఎండలు ఉండకపోవచ్చనేది కొంతమేర ఉపశమనం కలిగించే విషయం.
 
 
2010 నుంచి 2018 వరకు తొమ్మిదేళ్ల ఉష్ణోగ్రతలపై విపత్తుల నిర్వహణశాఖ రూపొందించిన నివేదికను పరిశీలిస్తే... 139 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత తొమ్మిదేళ్లలో కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువసార్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మండలాలను ఈ కేటగిరీ కింద గుర్తించారు. 466 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మొత్తం 670 మండలాల్లో కేవలం 65 చోట్లే సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయంటే ఎండల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
 
కోస్తాలో సెగలే..
ఎండలు అంటే రాయలసీమే గుర్తుకొస్తుంది. కానీ తీవ్రమైన ఎండలు సీమలో కంటే కోస్తాలోనే నమోదవుతుండటం విశేషం. కృష్ణా జిల్లాలో 50 మండలాలుంటే, అందులో 27 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశంలోని 56 మండలాల్లో 25 ఈ కేటగిరీలో ఉన్నాయి. గుంటూరులో 20, నెల్లూరులో 16 మండలాలు, ఉభయగోదావరి జిల్లాల్లో 12 మండలాల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఎండల జాబితాలోనూ అత్యధికంగా 52 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. చల్లగా ఉంటుందని భావించే ఈ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలం ఒక్కటీ లేకపోవడం విశేషం. దీంతోపాటు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలున్న మండలాలే లేవు.
 
 
2015, 2016లో 48, 49 డిగ్రీల వరకూ ఎండలు మండిపోయాయి. వాటికి తీవ్రమైన వేడిగాలులు వీయడంతో రాష్ట్రం భగభగలాడిపోయింది. ఈ ప్రభావంతో 2015లో 1,369 మంది, 2016లో 723 మంది వడదెబ్బకు చనిపోయారు. రాత్రి 8గంటల వరకూ అప్పట్లో వేడిగాలుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2017లోనూ 47.7డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 2018లో బాగా తగ్గి 44.9 డిగ్రీల వరకే ఆగిపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 44.7డిగ్రీల మేర ఎండలు కాయడంతో, గతేడాది కంటే పెరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ అంతకుముందు సంవత్సరాల తరహాలో మాత్రం ఉండకపోవచ్చని వాతావరణశాఖ నిపుణుల అంచనా.
 
 
2014 నుంచి 2018 వరకూ ఐదేళ్లలో వడదెబ్బకు 2,784 మంది మృత్యువాతపడ్డారు. 2014లో 448 మంది, 2015లో 1,369 మంది, 2016లో 723 మంది, 2017లో 236 మంది, 2018లో ఎనిమిది మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒక్క 2016లోనే 238 మంది చనిపోయారు. విజయనగరంలో 2015లో 214 మంది మృతిచెందారు.