నిరుపేద గిరిజనులే టార్గెట్‌..

Published: Sunday July 14, 2019
బయటి ప్రపంచం తెలియని గిరిజనులు, ఏజెన్సీలోని నిరుపేద మహిళలే వారి టార్గెట్‌! రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుంటారు. పరిచయం పెంచుకుని, వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు. అత్యవసరమైన సమయంలో వారికి కొద్దిపాటి ఆర్థిక సాయం చేస్తారు. అంతే.. à°† తర్వాత తియ్యని మాటలతో బుట్టలో వేసేస్తారు. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు మంచి పనులున్నాయని.. తమతో వస్తే కూలి పని ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. వారి మాటలు నమ్మి అమాయకంగా వెంటవెళ్లే మహిళలకు తీరా అక్కడికి వెళ్లేసరికి సీన్‌ రివర్స్‌ అవుతుంది. కూలి ఉండదు, తెలిసిన వారు ఉండరు, తెలిసిన భాష కాదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ముఠా సభ్యులు చెప్పింది వినే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఆసరాగా చేసుకుని à°† ముఠా సభ్యులు అమాయక మహిళలను రెడ్‌లైట్‌ ఏరియాల్లో విక్రయిస్తూ డబ్బులు దండుకుంటుంటారు. అడపాదడపా వారి కుటుంబసభ్యులకు కొంత సొమ్ము ఇస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత నిజం తెలిసినా పరువు పోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు మిన్నకుండిపోతున్నారు. à°ˆ బలహీనతను అడ్డుపెట్టుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం స్థావరంగా మహిళలే ఇలా ముఠాలు కట్టి అమాయకులను రెడ్‌లైట్‌ ఏరియాల్లో అమ్మేస్తుండడం గమనార్హం.
 
ఇలాంటి కేసులను పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితుల గురించి తెలిసినా.. పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబిస్తుండడంతో గిరిజన మహిళలను రెడ్‌లైట్‌ ఏరియాలకు తరలించే ప్రక్రియ చాపకింద నీరులా కొనసాగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 30-40మంది మహిళలు ఇలాంటి ముఠాల బారిన పడి మోసపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోగ్గూడెంలో కొందరు మహిళల మధ్య జరిగిన గలాటానే ప్రత్యక్ష సాక్ష్యం. గ్రామానికి చెందిన à°’à°• గిరిజన మహిళను à°—à°¤ ఏడాది భద్రాచలం పట్టణానికి చెందిన ముగ్గురు మహిళల ముఠా వలపన్ని మహారాష్ట్రలోని రెడ్‌లైట్‌ ఏరియాలో విక్రయించినట్లు తెలుస్తోంది. ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించినట్లుగా సమాచారం. ఏడాది పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితురాలు.. అక్కడినుంచి తప్పించుకుని తోగ్గూడెం చేరుకున్నట్లు తెలిసింది.
 
ఆగ్రహించిన మహిళా గ్యాంగ్‌ తోగ్గూడెం చేరుకుని సదరు మహిళతో వాగ్వాదానికి దిగడంతో à°ˆ విషయం పోలీ్‌సస్టేషన్‌ వరకు చేరింది. ఇది పోలీసులకు కొత్తేమీ కాదు. గతంలోనూ ములకలపల్లి మండలంలో à°’à°• మహిళను అదే మండలానికి చెందిన మరో మహిళ బలవంతంగా ముంబైలోని రెడ్‌లైట్‌ ఏరియాలో విక్రయించి వ్యభిచార వృత్తిలోకి దించి, మోసగించి డబ్బులు దండుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తప్పించుకుని వచ్చిన ఆమె.. తాను పడ్డ కష్టాలను అందరికీ చెప్పుకొంది. అన్నీ తెలిసిన పోలీసులు మాత్రం ఫిర్యాదు లేదనే సాకుతో కేసు నమోదు చేయలేదు. తాజాగా తోగ్గూడెంలో మహిళల మధ్య జరిగిన గొడవను ఆసరా చేసుకుని తీగ లాగాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా à°ˆ విషయంపై పోలీసులు దృష్టి పెట్టాలని, అమాయక గిరిజన మహిళలను మోసం చేసే ముఠా ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.