48 గంటల్లో 3 లక్షల క్యూసెక్కులు తగ్గిన కృష్ణా వరద

Published: Monday August 19, 2019
కృష్ణానదికి వరద తగ్గుముఖం పట్టింది. కేవలం 48 గంటల వ్యవధిలో దాదాపుగా 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి ఇది మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపుగా వరద ముప్పు తప్పినట్లేనని తెలిపాయి. అయితే, లంక గ్రామాలను చుట్టుముట్టిన వరదనీరు సముద్రంలోకి చేరడానికి మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. వరద పూర్తిగా తగ్గితే రోడ్లకు మరమ్మతులు, వంతెనల వద్ద పడిన గండ్లని పూడ్చే పనులు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ వర్గాలు తెలిపాయి. అలానే పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేస్తామని వ్యవసాయ శాఖ పేర్కొంది.
 
ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం నుంచి వరద ప్రవాహం à°—à°¤ 4 రోజులతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. ఆదివారం రాత్రి నాగార్జునసాగర్‌ నుంచి 2.80 లక్షల క్యూసెక్కులు మాత్రమే పులిచింతలకు విడుదల చేశారు. అప్పటికే పులిచింతలకు విడుదలైన నీరు కారణంగా అక్కడ 4.50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.
 
దిగువకు కూడా అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 5.48 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా దిగువకు 6.18 లక్షల క్యూసెక్కులు విడిచి పెడుతున్నారు. ఆదివారం హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున గుంటూరులోని లంక గ్రామాల్లో బోట్ల ద్వారా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
 
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ఇరిగేషన్‌ ఇంజనీర్లు క్రస్ట్‌గేట్ల లెవల్‌ను తగ్గిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 à°—à°‚à°Ÿà°² సమయానికి 881.90 అడుగుల వద్ద 198.3623 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. జూరాల నుంచి 3,60,666 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 68,390 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి, à°Žà°¡à°® కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వెనుక జలాల నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 34,000 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి 11 గంటలకు ఇన్‌ఫ్లో 3,73,850 క్యూసెక్కులు ఉంటే, ఔట్‌ ఫ్లో 4,76,027 క్యూసెక్కులు నమోదైంది.
 
కృష్ణా నది గర్భంలోని భవానీ ఐల్యాండ్‌ వరద నీటికి బురదమయమైంది. ఎగువ ప్రాంతంలో వరద నీరు తగ్గినా.. లోతట్టు ప్రాంతంలో అడుగు మేర వరద నీరు నిలిచింది. ఆదివారం సాయంత్రం నాటికి ద్వీపం వాయవ్య ప్రాంతంలో కొంత కోతకు గురైంది. వరద ప్రవాహానికి పలు చోట్ల ఇసుక మేటలు పోగు పడ్డాయి. ద్వీపం మొత్తాన్ని బురద పరచుకుంది. దీనివల్ల ద్వీపంలోని అభివృద్ధి ప్రాజెక్టులకు నష్టం వాటిల్లే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
మరోపక్క, కృష్ణానది వరద ప్రవాహానికి కృష్ణాజిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లోని కృష్ణవేణి విగ్రహం శనివారం రాత్రి కొట్టుకుపోయింది. 2016లో కృష్ణా పుష్కరాలకు ఘాట్‌ను నిర్మించాక అప్పటి ప్రభుత్వం 6 అడుగుల కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.