వైసీపీ ప్రభుత్వం... దేవుడి భూములకే ఎసరు పెడుతోంది

Published: Sunday August 25, 2019
చరిత్రలో తొలిసారి అర్చకుల కోసం ప్రభుత్వ నిధులు కేటాయించామని ఘనంగా ప్రకటించుకున్న వైసీపీ ప్రభుత్వం... ఇప్పుడు దేవుడి భూములకే ఎసరు పెడుతోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ఆలయాల భూములను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దేవుడి భూములు ప్రభుత్వ భూములు కాకపోయినా ఏదో à°’à°• రూపంలో తీసుకుని హామీలు అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. దేవుడి భూములపై గతంలో కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ భూములు సేకరించేందుకు రెవెన్యూశాఖ ముందుకెళ్తోంది. గతంలో దేవుడి భూములను ప్రభుత్వం సేకరించడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ‘ఆలయాల భూములు అంటే ప్రభుత్వ భూములు కాదు. ప్రభుత్వం వాటికి ట్రస్టీగా వ్యవహరించాలి తప్ప వాటిని తీసుకోకూడదు. ఆలయాల నిర్వహణ కోసం పూర్వం దాతలు వాటిని ఆలయాలకు ఇచ్చారు.
 
ఆలయ భూములను ఇతర అవసరాలకు తీసుకుంటే అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. ప్రభుత్వం ఒకవేళ ప్రజాప్రయోజనార్థం భూములు తీసుకోవాలంటే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలి. అది కూడా సరైన పరిహారం ఇచ్చిన తర్వాత తీసుకోవాలి’ అని తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఎవరూ దేవుడి భూముల జోలికి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు స్థలాలు ఇచ్చేందుకు దేవుడి భూములు తీసుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చింది. కాగా à°ˆ విషయంలో ఆలయాలకుగానీ, జిల్లాల దేవదాయశాఖ అధికారులకుగానీ వారి శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలూ జారీ కాలేదు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం భూముల వివరాలు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో ఆలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై ఏంచేయాలో పాలుపోని కొందరు దేవదాయ ఉద్యోగులు కమిషనరేట్‌ను ఆశ్రయిస్తున్నారు. దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు లేకుండా వివరాలు ఇవ్వాలా? లేదా? చెప్పాలని అడుగుతున్నారు.