సీఎం జగన్‌ ట్వీట్‌తో.. ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ప్రారంభం

Published: Sunday September 08, 2019
మద్యం షాపుల(వైన్స్‌)ను 20% తగ్గిస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణను కూడా తానే చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో బార్లను కూడా 20% తగ్గించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. వీటిలో 20%(170) తగ్గించేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. బార్ల తగ్గింపుపై ఇటీవల సీఎం జగన్‌ ట్విటర్‌లో à°“ ప్రకటన చేశారు. మద్యం దుకాణాలతో పాటు బార్లను కూడా తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు à°ˆ ప్రకటనకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించారు. వాస్తవానికి ప్రస్తుతం నడుస్తున్న బార్లకు 2022 వరకు లైసెన్సు గడువుంది.
 
దీంతో ఇప్పట్లో బార్లను కదపలేమని, షాపుల వరకే పరిమితం అవుదామని అధికారులు నిర్ణయించుకున్నారు. కానీ, సీఎం ప్రకటనతో ఇప్పుడు బార్లను తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ, 20% బార్లను ఏ ప్రాతిపదికన తగ్గించాలనే అంశం సంక్లిష్టంగా మారింది. నిబంధనల ప్రకారం 2022 వరకూ లైసెన్సులు జారీచేసినప్పుడు, మధ్యలో తీసేయడం విరుద్ధం. దీనిపై వ్యాపారులు కోర్టులను ఆశ్రయించే వీలుంది. ఒకవేళ ప్రభుత్వం ఒకేసారి అన్నీ తీసేసినా దాన్ని ఒక విధానపరమైన నిర్ణయంగా చెప్పవచ్చు. కానీ, కొన్ని మాత్రమే తీసేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
అక్టోబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం షాపులు అమల్లోకి వస్తున్నాయి. దీనివల్ల బార్లలో అమ్మకాలు భారీగా పెరుగుతాయని బార్ల యజమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌లు ఉండవు కాబట్టి, బయట తాగలేక మందుబాబులు బార్లకు వస్తారని వారు అంచనా వేసుకుంటున్నారు. అయితే, à°ˆ సమయంలో కొన్ని బార్లు తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఏ కారణాలు చూపించి లైసెన్సులు రద్దు చేస్తారోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఏవిధంగా బార్లను తొలగించినా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.