టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

Published: Wednesday September 11, 2019
టీడీపీ చేపట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ‘చలో ఆత్మకూరు’కు బయల్దేరిన పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌లతో పాటు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాసం శిబిరం చుట్టూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చారు. à°ˆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వని పోలీస్ ఉన్నతాధికారులు అర్ధరాత్రి నుంచే టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ మోహరించారు. పోలీసు అధికారుల ఆదేశాలతో టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు.
 
ఛలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామన్న చంద్రబాబును పోలీసులు ఇల్లు కదలనీయలేదు. ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు లోపలికి టీడీపీ నేతలను వెళ్లనీయలేదు. జడ్ ఫ్లస్ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటికి ఎలా వస్తారని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా అక్కడి నుంచి కదలని పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్టు చేశారు.
 
అటు ఆత్మకూరులో చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సును ఆత్మకూరు నుంచి తరలించారు. ఆత్మకూరుకు ర్యాలీగా బయలుదేరిన లోకేష్‌ను అమరావతిలో పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్‌ను హౌస్ అరెస్టు చేశారు. దీంతో పోలీసులు-టీడీపీ కార్యకర్తలు మధ్య వాగ్వాదం జరిగింది. ఛలో ఆత్మకూరు నేపథ్యంలో పల్నాడు, గుంటూరులలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్షన్ అమలులో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో అనుక్షణం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.