రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Published: Sunday September 15, 2019
విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నదులు పొంగుతున్నాయనే కారణంగా జిల్లాలో అధికారులు ఇసుక విక్రయాలు ప్రారంభించలేదు. అయితే, ఇసుక మాఫియా మాత్రం అడ్డు అదుపులేకుండా పేట్రేగిపోతోంది. ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటోంది. విజయనగరంలో లారీ ఇసుక రూ.25 వేలు కాగా.. విశాఖలో రూ.45 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. దీంతో ఇసుక మాఫియా రంగంలోకి దిగి చీకటిమార్గంలో నిత్యం వందలాది లారీలను విశాఖకు తరలించుకుపోతోంది. యంత్రాంగం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఒడిసా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఏఎస్పీ గరుడ్‌ శుక్రవారం రాత్రి 11 à°—à°‚à°Ÿà°² సమయంలో రాయగడ రోడ్డులో తనిఖీలు చేపట్టారు. వరుసగా వచ్చిన 15 లారీలను ఆపేందుకు ప్రయత్నించినా డ్రైవర్లు అతివేగంతో దూసుకుపోయారు. దీంతో పోలీసులు 5 కిలోమీటర్లు వెంబడించి అడ్డుకున్నారు. ఒడిసా రీచ్‌లో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన విజయనగరం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ అక్కడ నుంచి విశాఖకు ఇసుక తరలిస్తున్నారని తెలుసుకుని, కేసు నమోదు చేశారు.
 
విజయనగరం జిల్లాలోని గోస్తనీ, చంపావతి నదుల నుంచి పెద్ద ఎత్తున విశాఖ నగరానికి రోజూ ఇసుకను తరలిస్తున్నారు. గజపతినగరం మండలంలో చంపావతి నది పరివాహక ప్రాంతాల నుంచి 100 నుంచి 130 ట్రాక్టర్ల ఇసుకను విజయనగరం, విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీని వెనుక కూడా ఇసుక మాఫియా ఉంది. ఎస్‌.కోట మీదుగా విశాఖకి గోస్తనీ నది నుంచి ఇసుకను తరలిస్తున్నారు. కొత్త ఇసుక పాలసీలో భాగంగా ప్రభుత్వం విజయనగరం జిల్లాలో రెండుచోట్ల ఇసుక స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసింది. విజయనగరం డివిజన్‌లోని డెంకాడ, పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి సెంటర్‌లో ఇసుక నిల్వలు పెట్టింది.