పండగ పూట ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ బాంబు

Published: Monday October 07, 2019
పండగ పూట ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ బాంబు విసిరారు. సమ్మెలో పాల్గొంటున్న సుమారు 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించినట్టేనని దాదాపు స్పష్టం చేశారు. ‘‘ఆర్టీసీకి ఏడాదికి రు.1200 కోట్ల నష్టం వస్తోంది. రూ.5000 కోట్ల రుణ భారం ఉంది. పెరుగుతున్న డీజిల్‌ ధరలు వంటి ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చట్ట విరుద్ధంగా అదీ.. పండుగ సీజన్లో సమ్మెకు దిగిన కార్మికులతో రాజీ పడే సమస్యే లేదు. దసరా పర్వదినాన సమ్మెకు దిగి ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రమైన తప్పిదం చేశారు. వారితో ఇకపై ఎలాంటి చర్చలు జరిపేది లేదు. పండగ సందర్భంగా సమ్మె చేసింది కాక.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన సిబ్బందిని విధుల్లోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేదు. ఆర్టీసీలో ఇక మిగిలింది కేవలం 1200 మందిలోపే సిబ్బంది’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
 
తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 1,22,58,433 వివిధ రకాల ప్రైవేటు వాహనాలు ఉన్నాయని, ఇవన్నీ ప్రజల రవాణాకు ఉపయోగపడేవేనని తెలిపారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని నిర్దేశించారు. ‘‘వారి నియామక ప్రక్రియ అతి త్వరగా పూర్తి కావాలి. కొత్తగా చేరే సిబ్బంది యూనియన్లలో చేరబోమంటూ ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. కొత్త సిబ్బంది షరతులతో కూడిన నియామకం అవుతుంది. అందుకు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది’’ అని వివరించారు. ఏయే కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా సిబ్బందిని భర్తీ చేయడానికి à°ˆ నియామకాలని స్పష్టం చేశారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వ స్థితికి రావాలని చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. à°ˆ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవన్నారు.
 
‘‘సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో కూడా వ్యతిరేకత వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో విధులకు హాజరు కాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోం’’ అని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో క్రమశిక్షణా రాహిత్యం, బ్లాక్‌ మెయిల్‌ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.