ఒప్పందం గడువు ముగిసినా పంపట్లేదు

Published: Sunday October 13, 2019
‘తినడానికి తిండి లేదు. తాగేందుకు మంచినీరు లేదు. ఇరుకు గదుల్లో నిద్ర కూడా పట్టడం లేదు. ఉపాధి కోసం వచ్చి ఇరుక్కుపోయాం. ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. మన దేశానికి తీసుకుపోండి’.. సౌదీలో చిక్కుకుపోయిన తెలుగు యువకుల గోడు ఇది. శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు వంద మంది యువకులు హైదరాబాద్‌కు చెందిన మాసివ్‌ ఓవర్సీస్‌ కంపెనీ ద్వారా సౌదీలోని ఆర్కేవ్‌ కంపెనీలో ఎలక్ర్టికల్‌, ప్లంబింగ్‌, వెల్డింగ్‌ పనుల కోసం వెళ్లారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందినవారు గాజువాకకు చెందిన కన్సల్టెన్సీ ద్వారా హైదరాబాద్‌లోని మాసివ్‌ కంపెనీని సంప్రదించి వెళ్లారు. కంపెనీలో రెండేళ్లపాటు పని చేసేందుకు ఒప్పందంకుదుర్చుకున్నారు. ఈ గడువు ముగిసిపోయి ఆరు నెలలు దాటింది. అప్పటి నుంచి జీత భత్యాలు ఇవ్వడం లేదు.
 
ఆహారం, మంచినీరు సక్రమంగా అందడం లేదు. తిండి తిప్పల సంగతి సరే.. ఇక్కడి నుంచి స్వదేశానికి వెళతామా? లేదోననే ఆందోళన వారిలో అధికమయ్యింది. ఈ పరిస్థితుల్లో విశాఖ జిల్లా చోడవరం ప్రాంతానికి చెందిన యువకులు శనివారం స్థానిక విలేకరులకు ఫోన్‌ చేశారు. తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కంపెనీతో చేసుకున్న రెండేళ్ల ఒప్పందం గడువు ముగిసిపోయినా, ఆరు నెలలుగా ఇక్కడే ఉంచేశారని వాపోయారు. తమను సౌదీకి పంపించిన కంపెనీకి ఫోన్‌ చేసినా స్పందించడం లేదన్నారు. అధికారులు స్పందించి తమను స్వదేశానికి చేరేలా చూడాలని కోరుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.