జగన్ సర్కార్‌ స్పీడ్‌కు సడెన్ బ్రేక్..

Published: Wednesday November 06, 2019
సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 అసెంబ్లీ సీట్లు.. 22 పార్లమెంట్ స్థానాలు.. ఇది ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన అప్రతిహత విజయం. ప్రమాణస్వీకారం తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. నవరత్నాల అమలుకు దూకుడుగా ముందుకు వెళ్లింది. ఆర్థిక సమస్యలను సైతం అధిగమిస్తూ ముందుకెళ్తున్న జగన్ సర్కారు స్పీడుకి ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయ్యింది. అధికారపార్టీ వర్గాలు సైతం ఆఫ్ ద రికార్డ్ "తాము డిఫెన్స్‌లో పడ్డామని'' చెబుతున్నాయి. ఎందుకిలా సడెన్ బ్రేక్ పడిందనేదే కదా ఇప్పుడు మీకొచ్చిన డౌట్‌? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
  "చెప్పులోనిరాయి.. చెవిలోని జోరీగ.. ఇంటిలోని పోరు ఇంతింతగావయా!" అనే నానుడిని తలపించేలా ఉందట... ఇటీవల సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామంపై వైసీపీలో అంతర్గత చర్చ. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మందికి గ్రామ వాలంటీర్లుగా పోస్టులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, నవరత్నాల పథకాల అమలుతో... వడివడిగా అడుగులేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయ్యింది. నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణంలో పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థను వైదొలగాలని ఇచ్చిన ప్రీక్లోజర్ నోటీసుపై హైకోర్టు ముందస్తు స్టే ఇవ్వటం, ఆ తర్వాత తొలగించిన నేపథ్యంలో వైసీపీ నేతల సంబరాలు చేసుకున్నారు. వెనువెంటనే మెగా ఇంజనీరింగ్ కూడా పనులు ప్రారంభించింది. జలవిద్యుత్ ప్రాజెక్ట్, హెడ్ వర్క్స్ లో మిగిలిపోయిన పనులకు 4 వేల 987 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవగా, ఇందులో 12.6 శాతం తక్కువకు మెగా ఇంజనీరింగ్ టెండర్లు దక్కించుకోవటంతో సుమారు 628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని వైసీపీ నేతలు చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహన మిత్ర, పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్ఆర్ కంటి వెలుగు వంటి పథకాలను అమలు చేస్తున్నామనీ, అర్హులైన వారికి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిని అందిస్తున్నామనీ వైసీపీ మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేయటంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు.