రాజధానుల పేరుతో జగన్ రాక్షసక్రీడ

Published: Saturday December 28, 2019
రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం రాక్షసక్రీడకు తెరతీసిందని టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శనివారం ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ బోస్టన్‌ గ్రూపు అవినీతిపై విదేశాల్లో విచారణ జరుగుతోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక జగన్ తాత్కాలికంగా రాజధాని ప్రకటన వాయిదా వేశారన్నారు. రాజధానిపై జగన్‌ పంజా విసరడం ఖాయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
రాజమండ్రిలో వారసత్వంగా వచ్చిన భూమిలో 7 ఎకరాలు అమ్మి..2015 ఫిబ్రవరిలో అమరావతిలో 2.96 ఎకరాల భూమి కొనుగోలు చేశానని బుచ్చయ్యచౌదరి తెలిపారు. తాడేపల్లిలో జగన్‌ భవనం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అయితే తనది అదేనని అన్నారు. జగన్‌ తాత గుమస్తాగా ఉన్నప్పుడే నేను 60 ఎకరాల భూస్వామినని చెప్పారు. టీడీపీ మహిళా నేతల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న..మల్లాది విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
 
 
ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ హాయంలో ఎన్నో నిర్మాణాలు కొనసాగాయని బుచ్చయ్య చౌదరి అన్నారు. అప్పులు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేశామన్నారు. అప్పుడు మమ్మల్ని విమర్శించిన వైసీపీ..ఇప్పుడు ఎందుకు అప్పులు తీసుకొస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రాజధానిపై జగన్ కమిటీల మీద కమిటీలు వేస్తున్నారని, అనుకూలమైన నివేదికలు ఇప్పించుకుంటున్నారని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వమని గోరంట్ల తీవ్రస్థాయిలో విమర్శించారు.