చస్తే చందాలేసుకుని.. సాయం!

Published: Monday January 06, 2020
చాలీచాలని వేతనం.. చీత్కారాలు.. చీదరింపులు.. అమలుకు నోచుకోని హామీలు.. చివరకు చనిపోతే సహచరులు చందాలేసుకుని సాయం అందించాల్సిందే తప్ప ప్రభుత్వం పట్టించుకోదు.. గొంతెత్తి ప్రశ్నించకుండా à°•à° à°¿à°¨ ఆంక్షలు.. ఇదీ రాష్ట్రంలోని హోంగార్డుల దుస్థితి. ‘‘పోలీ్‌సశాఖలో అట్టడుగు స్థాయిలో విధులు నిర్వహించే హోంగార్డులు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు తీసుకుంటాం. వారిని అన్ని విధాలా ఆదుకుంటాం’’.. అని స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు. ఫలితంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో హోంగార్డులు కాలం వెళ్లదీస్తున్నారు. పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది హోంగార్డులు పని చేస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా 6 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ వేతనాలు మినహా ప్రభుత్వం నుంచి మరే ఇతర సౌకర్యాలు అందడం లేదు. వాస్తవానికి 13 డిసెంబరు 2017à°¨ ప్రగతిభవన్‌లో హోంగార్డులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. రూ.12 వేలుగా ఉన్న గౌరవ వేతనాన్ని రూ.20 వేలకు పెంచారు. ఏటా వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. హోంగార్డులతోపాటు వారి కుటుంబసభ్యులకు ఆరోగ్య బీమా, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో వేతన పెంపు తప్ప మిగతా హామీలేవీ అమలు కాలేదు. ఆరోగ్య బీమా లేకపోవడం, కానిస్టేబుళ్ల మాదిరిగా పోలీస్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో హోంగార్డులు అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ప్రైవేటు ఆస్పత్రిలో చూపించే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక, మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు, బందోబస్తు డ్యూటీ చేసే హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా డైట్‌చార్జీలు వంటివన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్‌ కలగానే మిగిలింది.
చందాలేసుకుని.. సాయం!
చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతూ విధులు నిర్వర్తించే హోంగార్డులు.. దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. దీంతో సహచర హోంగార్డులే తలా కొంత చందాలు వేసుకుని సహకారం అందిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో తమ తోటివారు ఎవరైనా చనిపోయినా, పదవీ విరమణ చేసినా... మిగతా వారంతా రూ.50 చొప్పున చందాలు వేసుకుని సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా 6 వేల మంది హోంగార్డుల నుంచి రూ.50 చొప్పున రూ.3 లక్షలు జమ చేసి.. చనిపోయిన హోంగార్డు కుటుంబానికి, పదవీ విరమణ చేసిన వారికి అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఇటీవల ఐదుగురు హోంగార్డులు మరణించారు. వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున అందించనున్నారు.